‘ఎన్టీఆర్’ బయోపిక్ అటు తిరిగి ఇటు తిరిగి.. క్రిష్ చేతికి వచ్చింది. ముందు తేజ లైన్లోకి వచ్చాడు. ఆయన సినిమా మొదలవ్వకముందే టాటా చెప్పేసి వెళ్లిపోవడంతో, బాలయ్యే ఈ బాధ్యత తీసుకుంటాడని ప్రచారం జరిగింది. ఓ దశలో బాలయ్య కూడా దర్శకత్వానికి రెడీ అయిపోయాడు. కానీ ఎందుకో.. చివరి నిమిషంలో ఆ ఆలోచన మారింది. ఎన్నిసార్లు అడిగినా ‘నో’ చెప్పిన క్రిష్… ఓ శుభముహూర్తాన ‘ఎస్’ అనేయడంతో… బాలయ్య గుండెల మీద భారం దిగిపోయినట్టైంది. క్రిష్ వచ్చాక ఈ కథలో మార్పులూ, చేర్పులూ తప్పవని అనుకున్నారు. తేజ సిద్ధం చేసి ఉంచిన స్క్రిప్టుని మళ్లీ క్రిష్ తిరగరాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే వీటిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. ”కథ పరంగా ఎలాంటి మార్పులూ లేవు. కానీ స్క్రీన్ ప్లే మారుతుంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన కసరత్తులే జరుగుతున్నాయి” అన్నారు క్రిష్. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. తేజ సిద్ధం చేసిన స్క్రిప్టులో ఏఎన్నార్ పాత్ర ప్రాధాన్యం అంతంత మాత్రంగానే ఉందట. క్రిష్ మాత్రం `ఏఎన్నార్ పాత్ర పరిధి పెంచాల్సిందే` అని సూచించడంతో ఆ పాత్రకు అదనంగా కొన్ని సన్నివేశాలు జోడించారని తెలుస్తోంది.