క్రిష్ మంచి సినిమాలు తీశాడు. ఓ గమ్యం, ఓ వేదం, ఓ కృష్ణం వందే.. ఓ కంచె… అన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలే. కానీ వాటిలో కమర్షియల్ విలువలు చాలా తక్కువ. ఆ మాటకొస్తే లేవు కూడా. క్రిష్ సినిమాలు కమర్షియల్ గా హిట్ అయిన దాఖాలాలు లేవు. దాంతో క్రిష్ లోనూ కాస్త అలజడి రేగింది. `ఎన్టీఆర్` బయోపిక్‌లు నేర్పిన పాఠమో ఏమో, `ఈసారి కమర్షియల్ సినిమా తీస్తా` అని డిసైడ్ అయిపోయాడు. పవన్ కల్యాణ్ తో తీస్తున్న సినిమాలో కమర్షియల్ హంగులు చాలా ఉన్నాయి. ఇది క్రిష్ తనని తాను మార్చుకుంటూ తీస్తున్న సినిమా.
అయితే అనుకోకుండా పవన్ సినిమాకి బ్రేక్ పడింది. క్రిష్ ఖాళీ అయ్యాడు. ఈ సమయాన్ని మరో సినిమా కోసం వెచ్చించాడు. వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా మొదలెట్టాడు. షూటింగ్ చక చక సాగుతోంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలెం` నవల ఈ చిత్రానికి ఆధారం. తానా వారి పోటీల్లో 2 లక్షల బహుమతి గెలుచుకున్న నవల అది. ఈ నవల చదివినవాళ్లందరికీ `ఇది సినిమాగా తీస్తే.. వర్కవుట్ అవుతుందా` అనే సందేహం రాక మానదు. ఎందుకంటే.. ఆ నవల నేపథ్యం, నడిచిన తీరు అలా ఉంటుంది.
నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. ఇదే ఈ సినిమాకు మూలం. ఈ జీవన విధానం చాలామందికి తెలీదు. వాళ్లంతా ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనిపిస్తోంది. పైగా హీరోయిజమో, మరోటో చూపించేందుకు ఆస్కారం ఉన్న కథ కాదిది. క్రిష్ ఈ నవలని సినిమాటిక్ గా మార్చుకుంటే తప్ప, కమర్షియల్ విలువలు అబ్బవు. కానీ క్రిష్ ఆ తరహా దర్శకుడు కాదు. నవల లో ఆత్మని చెడగొట్టడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి కమర్షియల్ హంగుల జోలికి పోడు కూడా. నవలలో సన్నివేశాలు లేదు. సంభాషణలు సైతం… ఉన్నది ఉన్నట్టుగా వాడుకుంటున్నాడని సమాచారం. కాబట్టి.. ఇదీ దీన్నీ ఓ ప్రయోగంగానే భావించాల్సిందే. అయితే ఈసారి క్రిష్ కి అండగా ఓటీటీ వేదిక ఉంది. ఈ సినిమా ఓటీటీ కోసమే తీస్తున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. ఎంత ప్రయోగమైనా, ఓటీటీ సినిమా అయినా ఈ ప్రభావం పవన్ సినిమాపై లేకుండా చూసుకోవాలి. క్రిష్ ముందున్న అసలైన సవాల్ అదే.