12 గంటల వ్యవధిలో హీరోలు లేకుండా… రెండు సినిమాల ఎనౌన్స్‌మెంట్లు జరిగిపోయాయి. ఇద్దరు దర్శకులూ ఏమైనా ఊరూ పేరూ లేనోరా.. అంటే అదీ లేదు. అటు క్రిష్.. ఇటు హరీష్ శంకర్.. ఇద్దరికీ తమకంటూ ఓ క్రేజ్ ఉంది. క్రిష్ పేరు చూసి సినిమాలకు వెళ్లొచ్చు. హరీష్ మాస్‌ని తనదైన శైలిలో ఆకర్షిస్తుంటాడు. క్రిష్ ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించాడు. ఎప్పటిలానే తన సొంత సంస్థలో ఈ సినిమా ఉండబోతోంది. కానీ.. హీరో ఎవరన్నది తెలీదు. హరీష్ కూడా అంతే. ‘సీటీమార్’ అనే పేరుతో ఓ సినిమా ప్రకటించాడు. ఈయన కూడా హీరో కోసం వెయిటింగ్. హీరోలు ఇంకా కన్ఫామ్ అవ్వకుండా.. ఇద్దరికీ అంత తొందరపాటు ఏమొచ్చిందో? తమ టైటిళ్లు అనధికారికంగా బయటకు వచ్చేస్తాయన్న భయంతో… ముందే అప్రమత్తమై.. అఫీషియల్‌గా చెప్పేసి ఉంటారు. క్రిష్ అడిగితే… హీరోలెవరూ కాదనరు. ఆయన ‘ఓ స్టార్ హీరోతో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి’ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు బయటపెట్టొచ్చు. కాకపోతే.. సదరు హీరో ఒప్పుకుంటాడా, లేడా అనే సందేహం ఈ ఎనౌన్స్మెంట్లో కనిపిస్తోంది. హరీష్‌శంకర్ పరిస్థితీ అంతే. ‘వరుస విజయాలు సాధిస్తున్న ఓ యువహీరో’ అన్నాడాయన. ఆయన చేతిలో ‘దాగుడు మూతలు’ ఇంకా పట్టాలెక్కలేదు. ఆ సినిమా పూర్తయితే గానీ… `సిటీ మార్` మొదలవ్వదు. సిటీమార్‌లో హీరో ఎవరన్నది ‘దాగుడు మూతలు’ డిసైడ్ చేస్తుంది. ఈలోగా ఆయనా తొందరపడిపోయారు. ఈ దర్శకులిద్దరికీ అంత కంగారేమొచ్చిందో మరి.