ఈ సంక్రాంతికి చిరంజీవిపై క్రిష్ అప్రకటిత యుద్ధం ప్రకటించేశాడు. చిరు సినిమాపై తన `గౌతమి పుత్ర`ని పోటీగా దింపుతున్నాడు. అయితే ఈ పోటీ కేవలం ఆ సినిమాకే పరిమితం. క్రిష్ అంటే చిరుకీ.. చిరు అంటే క్రిష్‌కీ అభిమానం. అందుకే `ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు.. వాళ్లని గౌరవిద్దాం `అంటూ చాలా హుందాగా ట్వీట్ చేసి అందరి మనసుల్నీ గెలుచుకొన్నాడు క్రిష్. అందుకేనేమో మెగా కాంపౌండ్ క్రిష్‌పై మరింత ప్రేమ పెంచుకొంది. ఏకంగా.. చిరు 151వ సినిమాని క్రిష్ చేతికి అప్పగించారని తెలుస్తోంది.
చిరు 150వ సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి ఎవరితో చేయాలి? అన్న చర్చలు మొదలెట్టింది మెగా కాంపౌండ్. బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి లైన్లోకి వచ్చేశారు. సురేందర్ రెడ్డి దగ్గర కథ రెడీగా లేకపోయినా.. బోయపాటి ఇది వరకే చిరు కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అయితే బోయపాటి, లేదంటే… సురేందర్ రెడ్డి.. వీరిద్దరిలో ఒకరితో చిరు 151వ సినిమా చేయడం ఖాయమనుకొన్నారు. అయితే సడన్ గా క్రిష్ రేసులోకి వచ్చాడు. ఇటీవల రామ్ చరణ్, క్రిష్ ఇద్దరూ కలసి చిరు 151వ సినిమా గురించి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. చిరుతో సినిమా చేయడానికి క్రిష్ అంగీకరించడంతో ఈ ప్రాజెక్టు దాదాపుగా ఓకే అయిపోయినట్టు సమాచారం. నిజానికి గౌతమి పుత్ర తరవాత క్రిష్ బాలీవుడ్లో ఓ సినిమా చేయాలి. ఇప్పుడు చిరు కోసం దాన్నీ పక్కన పెట్టే ఛాన్సుందని తెలుస్తోంది.