‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని క్రిష్ చేతుల్లో పెట్టేశాడు నందమూరి బాలకృష్ణ. ఆదివారం అధికారిక ప్రకటనా వచ్చేసింది. ఇంతలో క్రిష్ మార్పులు – చేర్పులలో నిమగ్నమైపోయాడు. ఇప్పటికే కథలో కొన్ని కీలక ఘట్టాల్ని తిరిగి రాయిస్తున్నాడు క్రిష్. అంతే కాదు.. టెక్నీషియన్స్ టీమ్‌లో కూడా మార్పులు మొదలయ్యాయి. బుర్రా సాయిమాధవ్.. తన మనిషే. ఇప్పటికే సగం డైలాగులు పూర్తయ్యాయి కూడా. అందుకే బుర్రా స్థానంలో ఎలాంటి మార్పూ లేదు. కెమెరామెన్, ఎడిటర్, విజువల్స్ ఎఫెక్ట్స్ డిజైనర్.. ఇలా కీలకమైన స్థానాలు మారబోతున్నాయి. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి పనిచేసినవాళ్లంతా ఇప్పుడు ‘ఎన్టీఆర్’ సినిమాలో భాగం అవుతారని సమాచారం అందుతోంది. బాలయ్య కూడా ‘క్రిష్ ఏం చెబితే అదే..’ అనే పద్ధతికి వచ్చేశాడట. ఓ దర్శకుడ్ని నమ్మితే… పూర్తిగా సరెండర్ అయిపోతాడు బాలయ్య. బోయపాటి శ్రీను, క్రిష్‌లతో బాలయ్య కెమిస్ట్రీ కుదరడానికి కారణం అదే. ‘గౌతమిపుత్ర’ అందంచిన స్ఫూర్తో, లేదంటే… అడిగి మరీ.. ప్రాజెక్టు అప్పజెప్పినందుకో.. బాలయ్య ఈ సినిమాని పూర్తిగా క్రిష్‌కే వదిలేసినట్టు సమాచారం. పారితోషికం విషయంలోనూ ‘మీరో అంకె చెప్పండి చాలు’ అంటూ ఆఫర్ ఇచ్చాడట బాలయ్య. మొత్తానికి బాలయ్య క్రిష్ దారిలోకి వెళ్లిపోతున్నాడు. ‘ఎన్టీఆర్’ ప్రాజెక్టు మొత్తాన్ని క్రిష్ తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు.