ఎన్టీఆర్ బయోపిక్‌ని క్రిష్ శాస్త్రియ పద్ధతిలో తెరకెక్కిస్తున్నాడు. గెటప్పుల విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. `ఎన్టీఆర్`గా బాలయ్య గెటప్ చూశారు కదా? నూటికి నూరు శాతం కాకపోయినా.. ఆ స్టిల్ చూసినవాళ్లు మాత్రం `అచ్చం అన్నగారిలానే ఉన్నాడు` అనేలా చేశాడు. ఇప్పుడు సేమ్ టూ సేమ్ చంద్రబాబు నాయుడు లుక్ విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడని సమాచారం. చంద్రబాబులా రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన షూటింగ్ లోనూ పాలు పంచుకుంటున్నాడు. సెట్లో రానాని చూసి.. చిత్రబృందమే షాక్ తిన్నదట. ఎందుకంటే.. చంద్రబాబుగా ఆ స్థాయిలో ఇమిడిపోయాడు. చంద్రబాబు – రానా.. వీరిద్దరి ఎత్తులో చాలా తేడా ఉంది. రూపు రేఖలు కూడా పూర్తిగా వేరు. కానీ… క్రిష్ తీసుకుంటున్న జాగ్రత్తలు, అనుసరిస్తున్న పద్ధతుల వల్ల ఈ లోపాలేం బయటకు రావడం లేదట. గెటప్ కూడా అచ్చం నారా చంద్రబాబునాయుడులానే ఉందట. అతి త్వరలో రానా గెటప్ విడుదల చేస్తారని, అది చూస్తే.. షాక్తినేలా ఉంటుందని అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్టుల్ని దిగుమతి చేసుకున్నారు. వాళ్ల అనుభవం, పనితనం క్రిష్‌కి బాగా కలిసొస్తున్నాయి. `ఎన్టీఆర్` సినిమాలోని అన్ని పాత్రలూ.. టిట్టో ఇదే స్థాయిలో ఉండకపోవొచ్చు. కానీ ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకునే పాత్రల్ని మాత్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ తీర్చిదిద్దుతున్నాడట. అందులో బాబు పాత్ర ఒకటి.