హరి హర వీరమల్లు టీజర్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే… ఇక పై ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు కాదు. ఆయన సారధ్యంలో ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ ముందుకు తీసుకెళ్తారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్, కొత్త పోస్టర్లో కూడా క్రిష్ తో పాటుగా జ్యోతికృష్ణ పేర్లు కనిపించాయి. ఈ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడే జ్యోతికృష్ణ. తనకు దర్శకత్వ అనుభవం ఉంది. ‘నీ మనసు నాకు తెలుసు’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. గోపీచంద్ సినిమా ‘ఆక్సిజన్’కు ఆయన దర్శకుడు. ఇటీవల ‘రూల్స్ రంజన్’ రూపొందించారు. అయితే ఈ మూడు సినిమాలూ ఫ్లాపులే. ‘వీరమల్లు’ నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఆపధర్మ దర్శకుడయ్యారు.
పవన్ తన ఎన్నికల హడావుడి వల్ల `వీరమల్లు`ని పట్టించుకోలేదు. ఇన్ అండ్ అవుట్.. లా, అప్పుడప్పుడూ కాల్షీట్లు ఇస్తూ వెళ్లాడు. దాంతో క్రిష్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని సందిగ్థంలో, అనుష్కతో మరో సినిమా మొదలెట్టాడు. పవన్ రాగానే మళ్లీ క్రిష్ జాయిన్ అవుతాడని అనుకొన్నారంతా. అయితే క్రిష్ కి ఒకేసారి రెండు సినిమాల్ని హ్యాండిల్ చేయడం ఇష్టం లేదు. అందుకే తన గైడెన్స్ లో జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఒప్పుకొన్నారు. రచయిత బుర్రా సాయిమాధవ్ ఎప్పుడో బౌండెడ్ స్క్రిప్టు ఇచ్చేశారు. దాన్ని జ్యోతి కృష్ణ ఫాలో అయిపోవడమే మిగిలింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో దాదాపు 80 శాతం క్రిష్ తీసిన సీన్లే ఉన్నాయట. ఆ రకంగా తొలి భాగం క్రెడిట్ మొత్తం క్రిష్కే దక్కుతుంది.