క్రిష్ టైమింగ్ కరెక్టేనా? కాదా? మణికర్ణిక విడుదలకు ముందు వివాదాలపై మౌనం వహించి, సినిమా విడుదలై విజయం సాధించిన తరవాత కంగనా రనౌత్‌ను టార్గెట్ చేయడం కరెక్టేనా? ఒకవేళ ‘మణికర్ణిక’ పరాజయం పాలైతే క్రిష్ బయటకు వచ్చేవారా? వివాదాల గురించి మాట్లాడేవారా? ఇప్పుడు కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల సమయంలో మణికర్ణిక వివాదాల గురించి క్రిష్ పెద్దగా పెదవి విప్పింది లేదు. తాను మణికర్ణిక కోసం 109 రోజులు షూటింగ్ చేశానని.. సోనూసూద్‌ని హఠాత్తుగా తొలగించి, ఆయన సన్నివేశాలను మరో నటుడితో చిత్రీకరించి, కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారనీ… ఇప్పుడేం మాట్లాడినా మణికర్ణిక శోభ తగ్గుతుంది కనుక వివాదాలకు దూరంగా, మౌనంగా వుంటున్నానని క్రిష్ మాట్లాడారు. సినిమా విడుదలైన తరవాత బాలీవుడ్ మీడియాకు తనను, తన టెక్నీషియన్లనూ కంగనా రనౌత్ ఎలా అవమానించినదీ వివరిస్తున్నారు. విడుదల తరవాత వివాదాల గురించి మాట్లాడుతుండటాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు.
క్రిష్ ఆవేదనలో ఓ అర్థం వుంది. తెలుగులో విమర్శకుల ప్రసంశలు, ప్రేక్షకుల అభినందనలు అందుకున్న చిత్రాలు తీసిన దర్శకుడితో ‘నువ్వు డైరెక్ట్ చేసిన వెర్షన్ భోజ్‌పురి సినిమాలా వుందని నిర్మాతలు అంటున్నారు’ అని అంటే ఎవరైనా కోపం వస్తుంది. క్రిష్‌కీ వచ్చింది.
సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేసినప్పుడు, ఎవరు ఏ సన్నివేశాలు తీశారో? వంటి సందేహం ప్రేక్షకులకు రావడం సహజం. అందులోనూ పంటికింద రాయి తగిలినట్టు మంచి సినిమాలో తప్పులు వస్తుంటే.. ఏది ఎవరు తీశారో? వంటి చర్చలకు ఆస్కారం రావడమూ సహజమే. సినిమాలో ఓ పాట వివాదాస్పదమైంది. ఈ పాటను డైరెక్ట్ చేసింది కంగనా అని క్రిష్ వివరణ ఇచ్చారు. చరిత్రకు విరుద్ధంగా కొన్ని సన్నివేశాలు తీసినది కంగనా అని క్లారిటీ ఇచ్చారు. టైటిల్ కార్డ్స్ లో క్రిష్ బదులు రాధాకృష్ణ జాగర్లమూడి అని పేరు వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
డబ్భై శాతం సినిమాకు తాను దర్శకత్వం వహించానని కంగనా రనౌత్ చెబుతున్న సమయంలో క్రిష్ బయటకు రాకపోతే అతడేం చేయలేదా? అతడు తీసిన సినిమాను పక్కన పడేసి కంగనా రనౌత్ మళ్లీ మొత్తం తీసిందా? అని ప్రేక్షకులు అనుకునే ప్రమాదం వుంది. అందుకని, క్రిష్ బయటకొచ్చినట్టు వున్నారు. క్రిష్ టైమింగ్ కరెక్టా? కదా? అనేది పక్కన పెడితే… నటీనటులను మార్చే అధికారం కంగనాకు ఎవరు ఇచ్చారు? సినిమాలో మార్పులు చేయడానికి ఆమెకు అధికారం ఇచ్చింది ఎవరు? సినిమాలో ఎవరెంత డైరెక్ట్ చేశారు? ఇలా క్రిష్ సంధించిన పలు ప్రశ్నలకు మణికర్ణిక నిర్మాతలు సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.