హృతిక్ రోషన్ వర్సెస్ కంగనా రనౌత్ గొడవ ఏమో గానీ… దర్శకుడు క్రిష్ నెత్తి మీద ఇప్పుడు ఒకటికి రెండు సినిమాల బాధ్యతలు పడ్డాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్గా కంగనా రనౌత్ నటిస్తున్న ‘మణికర్ణిక’ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నారు. కానీ, గ్రాఫిక్స్ సకాలంలో పూర్తికాలేదు. అందువల్ల, వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి వాయిదా వేశారు. అదే వీకెండ్ హృతిక్ రోషన్ ‘సూపర్30’ విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. హృతిక్, కంగన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ఇద్దరి సినిమాలు పోటాపోటీగా విడుదలకు సిద్ధమవడం హిందీలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ, తెలుగు దర్శకుడికి మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది.
‘మణికర్ణిక’ వాయిదా పడటంతో క్రిష్ డబుల్ డ్యూటీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క హైదరాబాద్లో ‘యన్.టి.ఆర్’ బయోపిక్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ… మరోపక్క మధ్య మధ్యలో ముంబై వెళ్లి ‘మణికర్ణిక’ గ్రాఫిక్ వర్క్స్ చూసుకోవాలి. రెండిటికీ దర్శకుడు ఆయనే కదా!
రెండు సినిమాలు వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకటి సంక్రాంతికి. మరొకటి గణతంత్ర దినోత్సవానికి. హిందీలో విడుదలకు రెండు మూడు నెలల ముందు నుంచి పబ్లిసిటీ మొదలు పెడతారు. అవీ చూసుకోవాలి. ఇక్కడ బాలకృష్ణ హీరోగా తెరకెక్కించే ‘ఎన్టీఆర్ బయోపిక్ పనులూ చూసుకోవాలి. బహుశా… క్రిష్ కూడా ఇటువంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకుని వుండడు. దర్శకుడిగా రెండు పడవల (రెండు సినిమాలు) మీద కాలు వేసి క్రిష్ ఎలా నెగ్గుకొస్తాడో?