క్రిష్ లాంటి దర్శకులెప్పుడూ మసి పూసి మారేడు కాయ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే… వాస్తవిక ప్రపంచంలో బతుకుతారు కాబట్టి. సినిమా విషయంలో ఆయనకంటూ కొన్ని నియమాలూ, సూత్రాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ జవ దాటలేదు. క్రిష్ చేతిలోకి ఓ ప్రాజెక్టు వెళ్లిందంటే.. అది కమర్షియల్‌గా హిట్ అయినా, అవ్వకపోయినా – కచ్చితంగా మంచి ప్రయత్నంగా మిగిలిపోతుంది. ఇప్పుడాయన `ఎన్టీఆర్`ని తెరకెక్కించే పనిలో పడ్డారు. క్రిష్ రాకతో ఈ ప్రాజెక్టుపై మరింత ఫోకస్ పెరిగిందనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే.. ఫస్ట్ లుక్‌తో కొన్ని అనుమానాలు ఎదుర్కోవాల్సివచ్చింది. దీన్ని మార్ఫింగ్ చేశారని, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి… మార్ఫింగ్ పెద్దగా తెలియడం లేదని, ఇది నిజమైన లుక్ కాదని విమర్శలొచ్చాయి. దాన్ని తిప్పికొట్టడానికి క్రిష్ ఈసారి కలర్ ఫొటోని ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తనయుడిగా బాలయ్య ఎలా ఉన్నా జనాలు చూస్తారు, ఆదరిస్తారు. బాలయ్య ఎన్టీఆర్‌లా కనిపించినా, కనిపించకపోయినా… ఎన్టీఆర్ వారసుడిగా ఆ పాత్రని ఆయనే బాగా పోషించగలని అభిమానుల నమ్మకం. ఈ పరిస్థితిలో క్రిష్‌కి మసిపూసి మారేడు కాయ చేయాల్సిన అవసరం లేదు. మార్ఫింగ్ ఆలోచన ఆయనకెప్పుడూ వచ్చి ఉండదు.
ఈ పాత్ర కోసం బాలయ్య.. అహర్నిశలు కష్టపడుతున్నాడు. తండ్రి లా మారడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దాని ఫలితమే.. ఈ లుక్. దాన్ని మార్ఫింగ్ అని ఇప్పుడే నిందించడం, క్రిష్ లాంటి దర్శకుడ్ని తొలి అడుగులోనే విమర్శించడం సబబు కాదనిపిస్తుంది. ఇంకొంత కాలం ఆగాలి. ఇంకొన్ని లుక్‌లు చూడాలి. అప్పుడుగానీ ఓ అవగాహనకు రాలేం. ఇదేం మార్ఫింగ్ ఫొటో కాదని… చిత్రబృందంలోని కొంతమంది సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఒకటి… వెండి తెరపై ఇలాంటి మార్ఫింగులకు చోటు లేదు. అక్కడ ఎలాంటి జిమ్మిక్కుల చేసినా దొరికిపోతారు. బాలయ్యని ఎన్టీఆర్‌గా మార్చాల్సిన బాధ్యత క్రిష్‌దే. అందులో ఆయన విజయవంతం అయ్యారా, లేదా? అనేది తెలియాలంటే… `ఎన్టీఆర్` రావాల్సిందే. ఇలా లుక్కులు చూసి ఓ అభిప్రాయానికి రావడం సరికాదేమో.