ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ పై ఉందంటే.. దాని చుట్టూ బోలెడన్ని ఊహాగానాలు. ప్రీ లుక్ చూసి, అందులో హీరో గెటప్ ని చూసి కథేంటో ఊహించేస్తారు ఫ్యాన్స్. పోస్టర్లూ, టైటిళ్లూ వాళ్లే వదిలేస్తుంటారు. పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ ఏమిటో ఇప్పటి వరకూ చిత్రబృందం ప్రకటించలేదు. అయితే బయట మాత్రం బోలెడన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విరూపాక్ష, గజదొంగ, ఓం శివమ్ – ఇలా రోజుకో పేరు బయటకు వస్తోంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ప్రకటిస్తారనుకున్నారంతా. కానీ…. క్రిష్ మాత్రం ప్రీ లుక్కే పరిమితమైపోయాడు. దాంతో టైటిళ్లపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.
తాజాగా `అంతర్వాహిణి` అనే మరో టైటిల్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేస్తున్నారు సాయి మాధవ్ బుర్రా. ఆయన తన ఫేస్బుక్ లో `అంతర్వాహిణి` అనే ఓ పేరు మీద ఓ కవిత రాస్తే, దాన్ని క్రిష్ ట్విట్టర్లో షేర్ చేశారు. అదిచూసి ఈసినిమాకి `అంతర్వాహిణి` అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలెట్టేశారు. అయితే ఇప్పుడు కూడా క్రిష్ స్పందించలేదు. ఈ దసరాకి క్రిష్.. టైటిల్ ని ఫిక్స్ చేస్తారని సమాచారం. అప్పటి వరకూ జనాలు ఏం మాట్లాడుకుంటున్నా, స్పందించకూడదని నిర్ణయించుకున్నార్ట. `విరూపాక్ష` అనే టైటిల్ ని క్రిష్ పరిశీలిస్తుందన్న మాట నిజం. కానీ… దానికంటే సులభంగా అర్థమై, క్యాచీగా ఉండే టైటిల్ కోసం క్రిష్ అన్వేషిస్తున్నాడని తెలుస్తోంది. గమ్యం, వేదం, కంచెలానే ఇది కూడా రెండు అక్షరాల టైటిల్ అనే తెలుస్తోంది. మరి.. ఆటైటిల్ ఏమిటో?