ఈమధ్య నవలా చిత్రాల హవా కాస్త పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. `కొండపొలెం` నవలను క్రిష్ సినిమాగా తీస్తున్నాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. `శప్తభూమి` నవలను ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ వెబ్ సిరీస్ గా నిర్మించే ఆలోచనలో ఉన్నారు. పాత నవలలు కొన్ని.. సినిమాలు గా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు `అతడు అడవిని జయించాడు` నవల కూడా… సినిమాగా వచ్చే అవకాశాలున్నాయని టాక్.
తెలుగునవలా ప్రపంచంలో.. అత్యుత్తమ రచనల్లో `అతను అడవిని జయించాడు` ఒకటి. డా.కేశవరెడ్డి రచించిన ఈ నవల ఎన్నో అవార్డులనూ రివార్డులనూ అందుకుంది. అడవికీ, మనిషికీ, మనిషికీ మృగానికీ, మనిషికీ ఆకలికీ.. మధ్య జరిగిన పోరు. తన పంది పిల్ల తప్పిపోవడంతో.. దాన్ని వెదుక్కుంటూ ఓ ముసలివాడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ.. ఏమైందన్న ఇతివృత్తంతో సాగే కథ ఇది. కథనం ఆధ్యంతం అబ్బుర పరుస్తుంది. నిజానికి క్రిష్ ఈ కథనే ముందు తీద్దామనుకున్నాడు. కానీ.. ఎందుకో `కొండ పొలెం` దృష్టిలో పడింది. ఒకవేళ `కొండ పొలెం` ఆశించిన ఫలితాన్ని అందిస్తే… `అతడు అడవిని జయించాడు` నవల కూడా సినిమాగా రావొచ్చు. ఇది వరకు ఈ నవలను సినిమాగా తీసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. మరి క్రిష్ ఏం చేస్తాడో.??