బాలకృష్ణ వందో సినిమా కి క్రిష్ దర్శకుడు అనగానే.. దాన్నో గాసిప్‌గా కొట్టి పారేశారంతా. కానీ.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఆ సినిమా పట్టాలెక్కింది.. అనుకొన్న సమయానికి విడుదలైంది.. సంచలన విజయం సాధించి బాలకృష్ణ అభిమానుల్నీ అలరించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా అర్థం చేసుకొన్న దర్శకుల్లో క్రిష్ పేరూ చేర్చేశారు అభిమానులు. తనకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన క్రిష్‌పై బాలయ్యకు అభిమానమూ.. నమ్మకమూ పెరిగిపోయాయి. అందుకే.. మోక్షజ్ఞ ని క్రిష్ చేతుల్లో పెట్టడానికి డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణికి సీక్వెల్‌గా వశిష్టీ పుత్ర పులోమావీ రాబోతోందన్న ప్రచారం జరిగింది. దానిపై క్రిష్ కూడా ఆశలు పెట్టుకొన్నాడు. గౌతమిపుత్ర కథని సినిమాగా తీయాలనుకొన్నప్పుడు గౌతమిపుత్రకి సంబంధించి దొరికిన ఆధారాలు చాలా స్వల్పం. అయితే పులోమావి గురించి మాత్రం కావల్సినంత సమాచారం ఉందట. అందుకే… అతని కథనీ తెరపై చూపించాలని క్రిష్ ఆరాటపడుతున్నాడు.
ఆ కథలో మోక్షజ్ఞ కనిపిస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట. గౌతమిపుత్ర వారసుడు పులోమావి. తన వారసుడు మోక్షజ్ఞ కాబట్టి.. ఆ పాత్రకు మోక్షజ్ఞ అయితేనే న్యాయం జరుగుతుందన్నది క్రిష్ ఆలోచన. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రంగా పులోమావి ఉండకపోవొచ్చు. కనీసం రెండు మూడు సినిమాలు చేస్తే, చారిత్రక చిత్రాలు చేసే అనుభవం, ధైర్యం వస్తాయని బాలయ్య నమ్మకం. అందుకే.. ‘కొంతకాలం ఆగుదాం.. ఈలోగా మీ సినిమాలు మీరు చేసుకోండి’ అని క్రిష్‌కి సలహా ఇచ్చాడట బాలయ్య. క్రిష్‌కీ ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. బాలీవుడ్లో అక్షయ్ కుమార్‌తో ఓ సినిమా చేయాల్సివుంది క్రిష్. ఆ తరవాత… వెంకటేష్ 75వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాకే… పులోమావి గురించి ఆలోచించొచ్చు.