ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తవ్వితే బడా బడా తిమింగలాలు అడ్డంగా దొరుకుతాయి. ఆ స్కాం ఏపీలో దోచారు. కానీ ఆ సొమ్మును చాలా చోట్లకు తరలించారు. మనీ లాండరింగ్ లో అన్ని రకాల పద్దతుల్ని పాటించారు. ఇప్పుడా స్కామ్ బయటకు పూర్తిగా రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిద్ధం కావాలి. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం కాలేదు. తమిళనాడులో అర్జంట్‌గా సోదాలు చేసి వెయ్యికోట్ల స్కాం అని ప్రకటించి ఈడీ ఏపీ వరకూ రాలేదు. కానీ లిక్కర్ స్కాంలో ఎలా డబ్బులు మారాయో..ఇప్పుడులోక్ సభలో టీడీపీ ఎంపీ బయట పెట్టారు. ఇప్పటికైనా స్పందిస్తారా?
ప్రభుత్వం పేరుతో లిక్కర్ దందా చేసుకున్న వైసీపీ నేతలు
వైసీపీ అధికారంలోకి రాగానే లిక్కర్ పాలసీ మార్చేశారు. దశలవారీ మద్యనిషేధం పేరుతో ప్రభుత్వ దుకాణాలు అని చెప్పి మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రేట్లు పెంచారు. తయారీ వాళ్ల… దుకాణాల్లోవాళ్లే.. ఎంత అమ్ముడయిందో లెక్కలు రాసేది కూడా వాళ్లే. మొత్తంగా ఎంత ఆదాయం అని వారు చెబితే అంత రాసుకోవడం తప్ప..ఏ లెక్కా ఉండదు. చివరికి డబ్బులు కూడా ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకోలేదు. ఇంత ఘోరంగా వేల కోట్లు దోచుకున్నారు.
బహిరంగంగానే మనీ లాండరింగ్
లిక్కర్ స్కామ్‌లో దోచుకున్న డబ్బును బహిరంగంగానే మనీలాండరింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి పూర్తి సమాచారం సీఐడీ ఇప్పటికే బయటకు తీసింది. జగన్ బంధువు సునీల్‌రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ.2 వేల కోట్లు తరలించారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్‌రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లు దుబాయ్‌కు మళ్లించారని సీఐడీ గుర్తించింది. అలాగే Adan, Graysons, Leela, JR Associates, PV Spirits లాంటి 26 కొత్త కంపెనీలకు పెద్ద ఎత్తు ఆర్డర్లు ఇచ్చారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి రూ.వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్లేలా చేశారు. ఈ వివరాలన్నింటినీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభకు సమర్పించారు.
సీఐడీ దగ్గర అన్ని ఆధారాలు – ఈడీ ఎంట్రీ కోసమే వెయిటింగ్
లిక్కర్ స్కామ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించింది. అన్ని వివరాలు సేకరించింది. సంపూర్ణమైన డాక్యుమెంట్ రెడీ అయింది. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈడీ కూడా రంగంలోకి దిగేలా చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం. ఈడీ ఎందుకు స్పందించడం లేదో కానీ.. అన్నీ బయట పడిన తర్వాత ఇంకా ఎంతో కాలం.. చూసీచూడనట్లుగా ఉండలేరన్న భావన ఏర్పడుతోంది.