ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను ఫేక్ సర్క్యులర్ ను క్రియేట్ చేయలేదని… అలా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమేనని జైలు నుంచి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
ఫోర్జరీ సర్క్యులర్ ను పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించింది సీఎం రేవంత్ అని, తాను కాదని లేఖలో ప్రస్తావించారు క్రిశాంక్. తెలంగాణ ప్రజలకు తాము పాలకులం కాదు… సేవకులమని సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్.. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు సీఎం పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కక్షపూరితంగా తనపై కేసులు నమోదు చేశారని ఈ సమయంలో బయటి నుంచి మద్దతుగా నిలుస్తోన్న బీఆర్ఎస్ నేతలకు, సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ తప్పుడు కేసులో తన కోసం వాదిస్తోన్న న్యాయవాదులకు , ప్రత్యేకించి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేసులకు భయపడేది లేదని ఇకపైనా తన పోరాటం కొనసాగుతుందంటూ పేర్కొన్నారు.
ఉస్మానియా వర్సిటీ హాస్టల్ మూసివేత ఇష్యుపై ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన క్రిశాంక్ ను ఆదివారం ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే, విచారణలో క్రిశాంక్ తాను ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేయలేదని పోలీసులతో చెప్పినట్లుగా తెలిసింది.