క్రిశాంక్.. బీఆర్ఎస్ సోషల్ మీడియా చైర్మన్. తన సోషల్ మీడియా టీంతో ప్రత్యర్ధి పార్టీలపై అనునిత్యం బురదజల్లేవారు. వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నేతలు, జర్నలిస్టులను సైతం శృతి మించి టార్గెట్ చేసేవారు. పార్టీకి వీరవిధేయుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కట్ చేస్తే 2023లో కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. కానీ, సాయన్న కూతురు లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పార్టీ గెలుపు కోసం పని చేశారు. కాని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే లాస్య నందిత అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో టికెట్ ఆశించారు. లాస్య నందిత సోదరి నివేదితకు టికెట్ కేటాయించడానికి ముందు నిరాశతో క్రిశాంక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
తాను అధికార ప్రతినిధిగా, సోషల్ మీడియాలో అనేక మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను తన విమర్శలతో బాధపెట్టి ఉండొచ్చు. అయితే.. అది తన పార్టీకి చేసిన సేవలో భాగమేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో క్రిశాంక్ టీం చేసిన సోషల్ మీడియా పోస్టులు ఎంతోమందిని గాయపరిచాయి. అప్పుడు ఈ అంశంపై స్పందించని క్రిశాంక్.. తనకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదని తెలియగానే పశ్చాతాపం ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టికెట్ నిరాకరిస్తే గానీ, క్రిశాంక్ కు తత్త్వం బోధపడలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నైతికతను మరిచి సోషల్ మీడియాను వాడేశారు. ప్రత్యర్దులను గేలి చేశారు. వారి మనసులను గాయపరిచారు. ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి తను పార్టీ ఎదుగుదల కోసమే తప్ప వ్యక్తిగతంగా ఎవర్ని గాయపర్చాలని అనుకోలేదని పేర్కొన్నారు. ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పక్కనపెట్టేసి సోషల్ మీడియాను వాడేసిన క్రిశాంక్ తప్పు జరిగిపోయినట్లుగా ట్వీట్ చేయడం కామెడిగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.