ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటోందని ఆరోపిస్తూ.. తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసినా.. పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు. పైగా తెలంగాణ మరింత దూకుడు పెంచింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి.. కరెంట్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ప్రాజెక్టుల్లో వస్తున్న అరకొర వరద నీటితో పాటు… ప్రాజెక్టుల్లో డెడ్ ఎండ్ స్టోరేజీగా ఉన్న నీరు సైతం.. దిగువకు వస్తోంది. పెద్ద ఎత్తున నీరు వస్తూంటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని .. ఏపీ ప్రభుత్వం దిగువకు వదిలేస్తోంది. దీంతో కృష్ణా నీరు సముద్రం పాలవుతోంది. తొమ్మిదో తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని కృష్ణాబోర్డు సమాచారం పంపింది. అయితే… అప్పటి వరకూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోతాయి. ఏపీ ప్రభుత్వ ఈ ఆందోళనను కృష్ణాబోర్డు పట్టించుకోవడం లేదు.
జగన్మోహన్ రెడ్డి గతంలో టీకాల విషయంపై లేఖలు రాసినప్పుడు.. మొదటగా టీకా టెక్నాలజీ బదిలీ.. అలాగే.. ప్రైవేటు ఆస్పత్రుకు టీకాలు ఇవ్వొద్దనడంపై కేంద్రం వెంటనే స్పందించింది. కానీ.. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయంలో మాత్రం అటు ప్రధాని నుంచి కానీ.. ఇటు కేంద్ర జలశక్తి మంత్రి నుంచి కానీ స్పందన రాలేదు. వారి వైపు నుంచి తెలంగాణ సర్కార్కు ఆదేశాలు వస్తే.. కొంతయినా పరిస్థితి మారుతుందని.. కృష్ణా జలాలు కరెంట్ ఉత్పత్తికి వాడకం తగ్గుతుందన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కొంత మంది అధికారులకు బాధ్యతలు ఇచ్చింది. వారెంత ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావడం లేదని చెబుతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని కేఆర్ఎంబీ, ఎన్టీటీ వద్దని చెప్పినా ఏపీ సర్కార్ నిర్మాణం ప్రారంభించడం.. ప్రాజెక్ట్ ప్రాంత పరిశీలనకు అంగీకరించకపోవడం వంటివాటితో.. వివాదాన్ని ఏపీ ప్రభుత్వమే ప్రారంభించిందన్న ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అనుమానాల్ని నివృతి చేసి.. తెలంగాణ చేస్తున్న కరెంట్ ఉత్పత్తిని నిలిపివేసేందుకు ఏపీ సర్కార్ అత్యున్నత స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. అయితే కృష్ణాబోర్డు భేటీ వరకూ.. తెలంగాణకు కేంద్రం వైపు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం లేదంటున్నారు.