ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు నుంచి ఒక్కటంటే.. ఒక్క మంచి కబురు అందడం లేదు. శ్రీశైలంలోకి నీరు చేరక ముందే.. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. ఫిర్యాదు చేసినా… కేఆర్ఎంబీ పట్టించుకోలేదు కానీ… రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను పిలవడంపై… తెలంగాణ ఫిర్యాదు చేయగానే… కేఆర్ఎంబీ స్పందించింది. తక్షణం టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కొద్ది రోజుల కిందట… ఎన్జీటీ నుంచి టెండర్లు కొనసాగించడానికి.. అనుకూలంగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు పొందింది. దాంతో.. టెండర్లు పిలిచి.. జ్యూడిషియల్ ప్రీవ్యూ ప్రక్రియకు సిద్ధమయింది. అయితే.. ఈ టెండర్లపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం… ప్రాజెక్ట్ ప్రకటన చేసి.. జీవో విడుదల చేసినప్పటి నుంచి ఏపీ సర్కార్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆ ప్రాజెక్టును.. రాజకీయంగా ఉపయోగించుకోవడానికి .. సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి హంగామా చేస్తున్నారు కానీ.. నిజంగా కట్టాలనుకుంటే… సన్నిహిత సంబంధాలు ఉన్న.. తెలంగాణ సర్కార్‌తో మాట్లాడి.. ఇబ్బందుల్లేకుండా చూసుకునేవారని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో… ఆ వివాదాన్ని అంతకంతకూ పెంచే ప్రయత్నమే చేశారు. కృష్ణారివర్ బోర్డును కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏకపక్ష నిర్ణయాలతో.. కేఆర్ఎంబీ కూడా.. పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఏపీ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా… ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న ఆరోపణలతో.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లన్నింటినీ.. ఇవ్వాలని కేంద్రం కోరింది. పీఎంఓ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే… ఏపీ సర్కార్ మాత్రం.. ఎవరూ అడ్డుకోలేరంటూ.. టెండర్లకు వెళ్లిపోతోంది. ఇప్పుడు.. కేఆర్ఎంబీ మళ్లీ లేఖ రాయడంతో.. టెండర్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల ఐదో తేదీన.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉందని.. అందులో తెలంగాణ నుంచి ఏపీ సర్కార్ ఆమోదం పొందితే.. ఇబ్బంది లేకుండా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. లేకపోతే.. ప్రాజెక్టుకు గండం ఏర్పడుతుంది.