రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద పనులు జరుగుతున్నాయని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కమిటీ .. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు రిపోర్ట్ సమర్పించింది. అక్కడ పనులేమీ జరగడంలేదని వాదిస్తున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టులో వివరాలు పొందుపరిచారు. ఏ ఏ పనులు ఎంత మేర జరిగాయో ఫోటోలతో సహా వివరించారు. డీపీఆర్ కోసం అవసరమైన పనులే చేస్తున్నామని ఏపీప్రభుత్వం వాదిస్తోంది. అయితే అంతకుమించిన పనులు జరిగాయని కృష్ణా బోర్డు తేల్చింది. సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతో కట్టడం నిలిపివేయాలి గతంలో ఎన్జీటీ స్టే ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఎన్జీటీలో పిటిషన్లు దాఖలయ్యాయి.
తాము స్టే ఇచ్చినా నిర్మాణాలు ప్రారంభించి ఉంటే సీఎస్‌ను జైలుకు పంపుతామని గత విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ హెచ్చరించింది. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరిగాయని కృష్ణా బోర్డు కమిటీ నివేదిక ఇవ్వడం ఏపీ ప్రభుత్వ అధికార వర్గాలను సైతం టెన్షన్‌కు గురిచేస్తోంది. అక్కడపనులు జరుగుతున్న కారణంగానే ఏపీ ప్రభుత్వం ఇంత కాలం … కృష్ణా బోర్డు కమిటీ పర్యటనకు అడ్డు పుల్ల వేసిందని.. చివరికి నిజం బయట పడిందని తెలంగాణ ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. నిజాలు చెప్పరేమోనని.. తమకు న్యాయం జరగదేమోనని తెలంగాణ సర్కార్ అనుకుంది. అయితే నివేదికలో పనులు జరుగుతున్న వైనం బయట పెట్టడంతో తెలంగాణ సర్కార్ కూడా సంతృప్తి చెందే అవకాశం ఉంది.
సోమవారం ఎన్జీటీలో సీమ ఎత్తిపోతల అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించినట్లుగా భావిస్తే.. గతంలో హెచ్చరించినట్లుగా సీఎస్‌పై చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం రాజకీయంగానూ సంచలనం అయ్యే అవకాశం ఉంది. మరో వైపు దూకుడుగా నిర్మాణం చేపట్టి.. అసలు ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టేశారన్న విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది.