అన్నింటినీ విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కార్ ఎక్కడా లేని ఉత్సాహం చూపిస్తోంది. సంబంధం లేని కార్యాలయాలను కూడా అక్కడికే తరలిస్తూండటం… కొత్త వివాదాలకు కారణం అవుతోంది. కృష్ణా రివర్ బోర్డును.. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. వాటి కార్యాలయాలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీకి..గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాజధాని కాబట్టి… కృష్ణాబోర్డు కూడా మొదట్లో హైదరాబాద్లోనే ఏర్పాటయింది. చంద్రబాబు పాలనను అమరావతి తీసుకు వచ్చిన తర్వాత ఆ బోర్డును ఏపీలోకి తేవాలని విజయవాడలో కార్యాలయం పెట్టాలని కేంద్రానికి లేఖలు రాశారు.
ఆ ప్రకారం.. కేంద్రం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి 2018లోనే ఆమోదం తెలిపారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కూడా.. అదే లేఖలను కేంద్రానికి పంపింది. అయితే హఠాత్తుగా మాట మార్చింది. రెండు రోజుల క్రితం కె ఆర్ యం బి కార్యాలయాన్ని హైదారాబాద్ నుంచి కాబోయే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం తరుపు నుంచి మరో లేఖ రాశారు. దీంతో అందరిలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. కృష్ణానది నడిబొడ్డున ఉన్న విజయవాడలో కాకుండా బేసిన్ దాటి 500 కిలో మీటర్లు అవల విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమయింది.
ప్రభుత్వం విశాఖ అనే సరికి.., కర్నూలు వాసులు కూడా.. డిమాండ్ చేయడం ప్రారంభించారు. సీపీఐ రామకృష్ణ.. కర్నూలులో… కేఆర్ఎంబీ బోర్డును ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. కొంత మంది సాగునీటి రంగ నిపుణులు.. సీమ ఉద్యమకారులు కూడా అదే కోరుతున్నారు. కేఆర్ఎంబీ ఉంటే విజయవాడలో..లేకపోతే కర్నూల్లో ఉండాలి. ఎందుకంటే.. పరివాహక ప్రాంతాలు కాబట్టి. కానీ విశాఖలో ఎందుకన్నదే చాలా మందికి అర్థం కాని. కానీ.. కార్యానిర్వహాక రాజధాని అనే ముద్ర కోసం.. ప్రభుత్వం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.