వాయిదాలు పడుతూ వస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కృష్ణాబోర్డు కమిటీ ఎట్టకేలకు పూర్తి చేసింది. గత వారమే పర్యటించాల్సి ఉన్నా… కమిటీలో తెలంగాణ అధికారి ఉన్నారన్న కారణంగా ఏపీ అభ్యంతరం చెప్పడంతో ఆగిపోవాల్సి వచ్చింది. చివరికి ఎన్జీటీ ఆదేశాలతో తెలుగు అధికారులెవరూ లేకుండా కమిటీని ఏర్పాటు చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు వెళ్లారు. పరిశీలించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు నమోదు చేయాల్సినవాటిని నమోదు చేశారు. ఎన్జీటీకి నివేదిక సమర్పించనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సంగమేశ్వరం వద్ద నిర్మించాలని ఏపీ సర్కార్ అనుకుంది.
దాని కోసం టెండర్లు ఖరారు చేసింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఎన్జీటీలో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని పిటిషన్లు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతులు తీసుకునేవరకూ నిర్మించవద్దని ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఇంకా ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాలేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం నిర్మాణాలు ప్రారంభించిందనే ఆరోపణలు ప్రారంభమయ్యాయి. కొంత మంది వీడియో సాక్ష్యాలతో మళ్లీ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. తాము స్టే ఇచ్చినా పనులు చేసి ఉంటే సీఎస్ ను జైలుకు పంపుతామని ఎన్జీటీ హెచ్చరించి తనిఖీలకు ఆదేశించింది.
అయితే ముందుగాతెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాతే తమ వద్దకు రావాలని ఏపీ సర్కార్ పట్టుబట్టింది. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం… కృష్ణాబోర్డు తనిఖీలకు కూడా సహకరించలేదు. ఈ కారణంగా వివాదం ప్రారంభమయింది. అయితే ఎట్టకేలకు కృష్ణాబోర్జు సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించింది. నిర్మాణాలు జరుగుతున్నాయో లేదో నివేదికి ఇవ్వనుంది. ఆ తర్వాత ఎన్జీటీ బోర్డు.. తన ఆదేశాలను వెల్లడించనుంది.