కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టం చెప్పింది. దాని ప్రకారం గత ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపింది. అయితే ఇప్పుడు ఆ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విజయవాడ కాదు.. విశాఖలో కృష్ణాబోర్డు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ కాబట్టి .. అక్కడే పెట్టాలని కోరింది. దానికి కృష్ణాబోర్డు కూడా సరేనంది. నిధులు ఇవ్వాలని.. నిధులివ్వకుండా ఎలా పెట్టగమని వాదిస్తోంది. అది వేరే విషయం . అయితే ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అధికారికంగా తెలంగాణ ఈఎన్సీ లేఖ కూడా రాశారు.
కృష్ణా బేసిన దాటి మూడు వందల కిలోమీటర్ల అవతల కృష్ణాబోర్డు ఏర్పాటు చేయడం ఏమిటన్నది తెలంగాణ అధికారుల అభ్యంతరం. తమ వాదనను వారు రాత పూర్వకంగా కృష్ణాబోర్డుకు తెలియచేశారు. వాస్తవానికి గతంలో విజయవాడ అంటే తెలంగాణ అంగీకరించింది. అదే విషయాన్ని లేఖలో చెప్పింది. విజయవాడ అంటే ఒప్పుకున్నాం కానీ… బేసిన్‌కు సంబంధం లేనిచోట పెట్టడం ఏమిటనేది తెలంగాణ అధికారుల వాదన. విజయవాడలో పెట్టకపోతే హైదరాబాద్‌లోనే ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ తమ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఏపీ సర్కార్ చెబుతున్నప్పటికీ అధికారులు.. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా… అభ్యంతరం వ్యక్తం చేయడమేమిటన్నది ఏపీ అధికారవర్గాల్లోనూ చర్చకు కారణం అవుతోంది.
విజయవాడలో పెడితే అభ్యంతరం లేదంటున్నారు. కృష్ణాబోర్డు భేటీ జరిగినప్పుడు అధికారులు హైదారాబాద్ నుంచి రావాల్సిందే. హైదరాబాద్‌లో విజయవాడ విమానానికి బదులు.. విశాఖ విమానం ఎక్కితే పనైపోతుంది. కానీ.. అసలు విశాఖలో వద్దని తెలంగాణ వాదించడం ప్రారభించింది. ఇప్పటికే కృష్ణాబోర్డును కర్నూలులో పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విశాఖకు సంబంధం లేకపోయినా కృష్ణాబోర్డును విశాఖకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ఆలోచన … రాయలసీమ, కోస్తా వాసుల్లోనూ అసంతృప్తికి కారణం అవుతోంది. ఇప్పుడు మధ్యే మార్గంగా.. దాన్ని హైదరాబాద్‌లోనే ఉంచేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.