రెచ్చగొడితే రెచ్చిపోబోమని.. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతామని .. కృష్ణాజలాలు సముద్రం పాలవుతున్నా.. నింపాదిగా ఏపీ ప్రభుత్వాన్ని చిటికెన వేలితో నడిపిస్తున్నానని భావించే సలహాదారు సజ్జల చెబుతున్నారు. కానీ ఆయనకు ఉన్నంత ధీమా కృష్ణా డెల్టా రైతులకు లేకుండా పోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతే.. తర్వాత కాలేది తమ కడుపేనని అర్థం చేసుకుని న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రధానికి లేఖలు రాశామని.. కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తోందని.. సజ్జల చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం ఇలాంటి మాటలు నమ్మడం కన్నా.. తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. దీనికి సంబంధించిన జీవోను నిలిపివేయాలంటూ.. రైతులు పిటిషన్లో కోరారు.
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రైతులు పక్కా సమాచారం సేకరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా జీవో ఇచ్చారని.. ఏదైనా కృష్ణాబోర్డు ఆదేశాల మేరకే జరగాలని… కానీ తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా జీవో ఇచ్చిందని పిటిషన్లో తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో పాటు కృష్ణాబోర్డు కూడా విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కోరిందని.. వాటికి సంబంధించిన లేఖలను జత చేశారు. ఎటువంటి ఇరిగేషన్ అవసరం లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవటం అన్యాయం అని పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ రైతులు పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణలో తెలంగాణ హైకోర్టు ఏం చెబుతుందో కానీ.. రైతులు మాత్రం.. ఏపీ సర్కార్ ను నమ్ముకోవడం కన్నా.. తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకోవడం.. ఆసక్తిరంగా మారింది. నీళ్లను కాపాడేందుకు ఏపీ సర్కార్ పరంగాఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. వాడుకుంటే వాడుకోనీ అన్నట్లుగా ఉన్నారు. గతంలో.. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేసినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇతరులు పిటిషన్లు వేస్తే… ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు.. రైతుల పిటిషన్లో ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందో.. తమకు సంబధం లేనట్లుగా ఉంటుందో వేచి చూడాలి..!