ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుదల కావడం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే కథతో విడుదలైతే, రెండూ ఒకే జోనర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ అరుదైన విచిత్రం.. 1977 జనవరి 14న సాక్షాత్కారమైంది. ఆ ఫ్లాష్ బాక్ లోకి ఓసారి వెళ్తే…
ఎన్టీఆర్ దర్శకుడిగా, మూడు పాత్రల్లో ‘దానవీర శూర కర్ణ’ మొదలైంది. ఈసినిమాని మొదలెట్టినప్పుడే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్. సరిగ్గా.. అప్పుడే కృష్ణలోనూ… ఓ పౌరాణిక చిత్రం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆయనదీ సంక్రాంతి టార్గెట్టే. ‘కురుక్షేత్రం’ పేరుతో సినిమా ప్రకటించేశారు కృష్ణ. కృష్ఱంరాజు, శోభన్‌బాబు.. ఇలా భారీ తారాగణాన్ని సెట్ చేశారు.
దానవీర శూర కర్ఱ, కురుక్షేత్రం రెండూ.. ఒకే కథతో రెడీ అవుతున్నాయన్న సంగతి ఇండ్రస్ట్రీ అంతా తెలిసిపోయింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. కృష్ణను కబురంపారు. ‘మనం ఇద్దరం యాధృచ్చికంగా ఒకే కథతో సినిమాలు తీస్తున్నాం బ్రదర్.. పైగా ఒకే రోజు రావడం మంచిది కాదు. మీరు మీ సినిమాని కనీసం ఒక నెల పోస్ట్ పోన్ చేసుకోగలరా..’ అని ఎన్టీఆర్ అడిగార్ట. కానీ.. కృష్ణ మాత్రం అంగీకరించలేదు. ”సంక్రాంతికి ప్లాన్ చేశాం అన్నగారూ. ఆ సినిమా సంక్రాంతికి రావడమే బెటర్ అనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించేశాం. ఇప్పుడు మారిస్తే బయ్యర్లు నష్టపోతారు” అని సర్ది చెప్పి వచ్చేశారు.
రెండు సినిమాలూ పూర్తయ్యాయి. అప్పట్లో కృష్ణకి ఓ సెంటిమెంట్ ఉండేది. సినిమా ఏదైనా సరే, తొలుత చక్రపాణికి చూపించడం అలవాటు. ఆయన కోసం ప్రత్యేకంగా ఓ షో వేశారు. ”చాలా బాగుంది కృష్ణ. ముగ్గురు హీరోల్ని తెరపై చూడడం ఇంకా బాగుంది. చాలా ఖర్చు పెట్టి తీశావ్. తప్పకుండా ఆడుతుంది” అని దీవించి వెళ్లారు.
కురుక్షేత్రం చూసిన కొన్ని రోజులకే… ఎన్టీఆర్ కూడా చక్రపాణి కోసం ‘దానవీర శూర కర్ణ’ షో వేసి చూపించారు. ఆ సినిమా చూసిన వెంటనే… కృష్ణని కలిశార్ట చక్రపాణి.
”దానవీర శూరకర్ణ చూశాను. అది కర్ణుడి కథ అనుకున్నా. కానీ కురుక్షేత్రం మొత్తాన్ని చూపించేశాడు ఎన్టీఆర్. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ ని చూస్తుంటే నటిస్తున్నట్టు లేదు. గదతో తెర చీల్చుకుని ప్రేక్షకులపై దాడి చేసినట్టు ఉంది. ఆ ప్రభావం ఇప్పట్లో పోదు. నా మాట విని.. నీ సినిమాని వాయిదా వేయ్.. ఆ సినిమాని తట్టుకోవడం కష్టం అనిపిస్తోంది” అని సలహా ఇచ్చార్ట.
కృష్ణ మొండితనం తెలియంది కాదు. మడమ తిప్పని వ్యక్తి. `తప్పదు సార్.. ఒకేరోజు విడుదల చేయాల్సిందే. ఇద్దరం యుద్ధ రంగంలోనే ఉన్నాం. మడమ తిప్పితే ఓడిపోయినట్టే. నా సినిమా ఆడకపోతే. ఎన్టీఆర్ ధాటికి నిలబడలేకపోయాననుకుంటారు. ఎన్టీఆర్ ని చూసే సినిమాల్లోకి వచ్చా. ఈరోజున ఆయనకు పోటీగా సినిమాని విడుదల చేసే స్థాయికి వచ్చా. సినిమా ఆడితే.. ఎన్టీఆర్‌ని ఓడించారని చెబుతారు. లేదంటే.. ఆయన చేతిలో ఓడిపోయానంటారు. రెండూ నాకు గొప్పే` అని సూచనను సున్నితంగా తిరస్కరించార్ట.
చెప్పినట్టే… రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలయ్యాయి. సాంకేతికంగా `కురుక్షేత్రం` బాగున్నా.. ఎన్టీఆర్ `దానవీరశూరకర్ఱ` ధాటికి నిలబడలేకపోయింది. దానవీరశూరకర్ణ ప్రభంజనం ముందు.. కృష్ణ సాహసం తేలిపోయింది. తెలుగులో ఈ సినిమా సరిగా ఆడలేదు. కానీ హిందీలో డబ్ చేస్తే.. మంచి వసూళ్లు వచ్చాయి. చక్రపాణి చెప్పినట్టు.. ఒక నెల ఈ సినిమాని వాయిదా వేస్తే… తప్పకుండా మంచి ఫలితమే వచ్చేది.