వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహాని ఉందంటూ ఎస్పీలకు వరుసగా చేస్తున్న ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ బాధ్యతను వివేకా వద్ద ముఫ్ఫై ఏళ్ల పాటు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి తీసుకున్నారు. ఆయన నేరుగా కడప ఎస్పీని కలిసి రాసుకొచ్చిన ఫిర్యాదు ఇచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ ఎస్పీ మాత్రం మీడియాను పిలిచి అన్నీ చెప్పారు. వివేకానందరెడ్డి వద్ద 30 ఏళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణారెడ్డి తనను కలిశారని .. ఆయన హత్య కేసులో అనుమానితుడిగా ఉన్నారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
వివేకా కుమార్తే సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డిల నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారని.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కొద్ది రోజులుగా వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహాని ఉందంటూ వరుసగా కొంత మంది వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి , భరత్ యాదవ్ , గంగాధర్ రెడ్డి అనే వ్యక్తులు ఇప్పటి వరకూ వైఎస్ సునీత, అల్లుడిపై ఆరోపణలు చేశారు.
ఇప్పుడు కొత్తగా పీఏ కృష్ణారెడ్డి వారి జాబితాలో చేరారు. ఇలా ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారికి ఎస్పీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. మీడియాను పిలిచి వైఎస్ సునీత , అల్లుడిపై ఫిర్యాదులు అందాయని గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే సీబీఐ కొద్ది రోజులుగా ఈకేసులో ఏం చేస్తుందో ఎవరికీ తెలియడంలేదు. అనంతపురం ఎస్పీకి సీబీఐపై గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన తర్వాత సీబీఐ సైలెంట్ అయిపోయింది.