స్వీయ లోపంబులెరుగుట గొప్ప విద్య. కానీ దురదృష్టం కొద్దీ అదే ఈరోజుల్లో కనిపించడం లేదు. ముఖ్యంగా సినిమావాళ్లలో. స్టార్లంతా మేం చేసిందే నటన.. మేం చెప్పిందే డైలాగ్ అనుకొంటున్నారు. ఎవరైనా లోపాలు ఎంచితే – ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. విమర్శల్ని హుందాగా తీసుకోవడం, తప్పొప్పుల్ని సమీక్షించుకోవడం, స్వీయ పరిశీలన ఇవన్నీ క్రమంగా దూరమైపోతున్నాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ పద్ధతి, ఆయన ఆత్మ పరిశీలన… ఈతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తనపై వేరే వాళ్లు సెటైర్ వేసే లోపు.. తనపై తనే సెటైర్ వేసుకోగల దమ్ము, ధైర్యం ఉన్న నటుడు ఆయన. అందుకు సాక్ష్యం ఈ ఉదంతం.
‘కృష్ణావతారం’ షూటింగ్ జరుగుతున్న రోజులవి. బాపు దర్శకుడు. కృష్ణ హీరో. అంతకు ముందు ‘సాక్షి’ కోసం వీళ్లిద్దరూ పని చేశారు. ఆ తరవాత ఈ కాంబోలో సినిమా రావడం ఇదే తొలిసారి. ఓ రోజు సెట్లో గంభీరమైన సీన్ రాసిచ్చారు రమణ. కృష్ణ ఎమోషన్తో కూడిన డైలాగులు చెప్పాలి. ఈసీన్ సినిమాలో చాలా కీలకం. ఈ సీన్ ఎంత పండితే – అంత డ్రామా జనరేట్ అవుతుంది. అందుకే కృష్ణకు బాపు ఈ సీన్ వివరిస్తూ, ఏ డైలాగ్ దగ్గర ఎలాంటి హావభావాలు పలికించారో స్పష్టంగా తర్ఫీదు ఇచ్చారు. సీన్ మొదలైంది. కృష్ణ డైలాగులు, ఎక్స్ప్రెషన్స్.. బాపుకి నచ్చలేదు. ‘నేను చెప్పినట్టు మీరు చేయడం లేదు.. నాకు కావల్సింది ఇదీ…’ అంటూ మరోసారి డైలాగ్, ఎక్స్ప్రెషన్ స్వయంగా నేర్పించారు. మళ్లీ టేక్కి వెళ్లారు. కానీ.. కృష్ణ డైలాగుల్లో, ఎక్స్ప్రెషన్స్ లో ఎలాంటి మార్పూ లేదు. టేక్ 1లో ఏం చేశారో, టేక్ 2లోనూ అచ్చంగా అదే చేశారు. బాపు మళ్లీ ప్రశాంతంగా తనకేం కావాలో చెప్పారు. టేక్ 3 మొదలైంది. కానీ.. ఫలితంలో మార్పు లేదు. బాపులో సహనం ఎక్కువ. ఎవర్నీ ఓ మాట అనడం ఇష్టం ఉండదు. పైగా అప్పటికి కృష్ణ సూపర్ స్టార్. అందుకే ఏం చేయలేక.. బ్రేక్ చెప్పారు. మళ్లీ కృష్ణ దగ్గరకు వెళ్లి.. ”మరేం ఫర్లేదు. బ్రేక్ టైమ్ లో సీన్ బాగా చదివి, ప్రాక్టీస్ చేయండి” అంటూ కాస్త ఓపిగ్గానే చెప్పారు.
బ్రేక్ తరవాత.. సీన్ మళ్లీ మొదలైంది. టేక్ 1లో కృష్ణ ఏం చేశారో టేక్ 13లోనూ అదే చేసేసరికి.. బాపూ ఫస్ట్రేషన్కి లోనయ్యారు. కట్ చెప్పి, పక్కకు వెళ్లిపోయారు కోపంగా. బాపు కోపంలో ఉన్నారన్న సంగతి కృష్ణకు అర్థమైంది. వెంటనే రమణ దగ్గరకు వెళ్లి.. ”రమణగారు.. బాపు గారికి ఓ విషయం చెప్పండి. ‘సాక్షి’లో కృష్ణకీ ‘కృష్ణావతారం’లో కృష్ణకీ చాలా తేడా ఉంది. ఈ సీనియార్టీలో చాలా విషయాలు నేర్చుకొన్నాడు.. ఎలాంటి సీన్ అయినా కొత్తగా చేసుకొంటూ వెళ్తాడు అని ఆయన అనుకొంటున్నారేమో. అదేం లేదు. ‘సాక్షి’ టైమ్ లో కృష్ణకూ, ‘కృష్ణావతారం’లో కృష్ణకూ ఎలాంటి మార్పూ లేదు. అదే నటన. ఈ సీన్ ఎన్ని టేకులు చేసినా, ఇలానే నటిస్తాను. ఆయనకు ఫస్ట్రేషన్, రీళ్లు వృథా తప్ప ఏ మార్పూ ఉండదు” అని తనపై తానే సెటైర్ వేసుకోవడంతో.. రమణ భళ్లున నవ్వేశారు. పక్కనే ఉన్న బాపు సైతం.. అప్పటి వరకూ ఉన్న కోపాన్ని మర్చిపోయి ఆ నవ్వుల్లో శ్రుతి కలిపారు.
ఇదే కాదు… చాలాసార్లు కృష్ణ ఇదే చేశారు. ‘రెండో టేక్’ అడిగితే నిర్మొహమాటంగా ‘ఎన్ని టేకులు చేసినా నా నటన మారదు… ఇదే ఓకే చేసుకోండి’ అని నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఆ ధైర్యం ఎవరికుందిప్పుడు?