ఈ సంక్రాంతికి 5 సినిమాలొస్తున్నాయి. కానీ ప్రేక్షకుల మొదటి ఛాయిస్ మాత్రం ‘గుంటూరు కారం’. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలు కొట్టగలిగే సత్తా… ఈ సినిమాకి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో సంక్రాంతి వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది కూడా. మహేష్ బాబు ఇది వరకెప్పుడూ చూడని మాస్ అవతార్‌లో దర్శనమిస్తున్నాడు. దానికి తోడు మాస్‌కి, మహేష్ అభిమానులకు నచ్చేలా మరిన్ని ఐటెమ్స్ ఈ సినిమాలో పొందుపరిచేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు త్రివిక్రమ్.
‘కుర్చీని మడతపెట్టి’ అనే పాట విమర్శలకు గురి అవుతున్నా – ఈ పాట మాస్‌లోకి బాగా వెళ్లిపోయింది. పండగ రోజు, ఓ మాస్ థియేటర్లో ఈ పాటని చూస్తే… పూనకాలు రావడం గ్యారెంటీ. దానికి తోడు ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 2022 నవంబరులో కృష్ణ కన్నుమూశారు. ఆయన మరణం తరవాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇదే. కాబట్టి.. కృష్ణ ని గుర్తు చేసేలా కొన్ని సీన్లు డిజైన్ చేశారట త్రివిక్రమ్. ఓ ఫైట్ సీన్లో.. కృష్ణ వాడిన డైలాగ్ తో పాటు, పాటలోని బీజియమ్ని కూడా వాడారని తెలుస్తోంది. మరి ఆ డైలాగ్ ఏమిటి? ఆ పాటేమిటి? అనేది తేలాల్సివుంది. ఈనెల 6న ‘గుంటూరు కారం’ ట్రైలర్ రాబోతోంది. బహుశా.. ఆ ట్రైలర్లో ఏదైనా క్లూ దొరకొచ్చు.