Krishna Sri Sri Movie Review, Sri Sri Review, Sri Sri Movie review
75 వసంతాల సూపర్‌స్టార్ కృష్ణ, సినిమా పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లయిన సందర్భమిది. గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో ఆయన నటించిన చిత్రం `శ్రీశ్రీ`. ఎవర్ గ్రీన్ హీరో గా పేరు తెచ్చకున్న కృష్ణ, విజయనిర్మల తో కలిసి నటించారు. ముప్పలనేని శివ ఈ చిత్రానికి దర్శకుడు. మహా రచయిత శ్రీ శ్రీ టైటిల్ రోల్ తో కృష్ణ పోషించిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందా? ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా? లేదా? అనేది ఈ రివ్యూ లో ద్వార చదవండి…!
కథ:
న్యాయ శాస్త్రం గురించి పలు విషయాలను పుస్తక రూపం లో అందించిన శ్రీపాద శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ (కృష్ణ) లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయనకు ఓ కొడుకు, ఓ కుమార్తె శ్వేత ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకుని స్థిరపడతాడు. కూతురు స్పై టీవీలో డైనమిక్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటుంది. తండ్రి బాటలోనే న్యాయం, ధర్మం గురించి మాట్లాడుతుంటుంది. వాళ్లున్న ప్రదేశానికి దగ్గర్లోని ఓ గూడెంలో జె.కె (మురళీ శర్మ) గ్రూప్స్ పెట్టిన ఫ్యాక్టరీల వల్ల అన్యాయం జరుగుతుంటుంది. జె.కె.కి భిక్షఫతి(పోసాని) బాగా తోడవుతాడు. వీరిద్దరు కలిసి చేస్తున్న అరాచకాల గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తుంది శ్వేత. ఆ క్రమంలో జె.కె. కొడుకుతో పాటు మరో ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేసి చంపేస్తారు. తన కళ్ల ముందే కూతురు ప్రాణాలు విడవడాన్ని చూసిన శ్రీశ్రీ తట్టుకోలేక కోర్టుకు ఎక్కుతాడు. అయితే సాక్ష్యాలు తారుమారయ్యి అక్కడ కూడా అతనికి చుక్కెదురవుతుంది. దాంతో తన భార్య సుమతి (విజయనిర్మల) ఇచ్చిన సలహా మేరకు ఆయన ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి? శ్వేత చావుకు శ్రీశ్రీ ఎలా ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? ఏసీపీ అజయ్ (నరేశ్) ఎవరు? మంచి వాడా? చెడ్డవాడా? అన్నదే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
75 వసంతాల సూపర్‌స్టార్ కృష్ణ, సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి 50 ఏళ్లయినా ఇప్పటికీ అదే చరిష్మాతో, నటన పై మక్కువతో కృష్ణ ఇంకా లైం లైట్ లో నటించడం గొప్ప విషయం. వందల సినిమాలు చేసిన అయన ఈ కారెక్టర్ లో ఎలా చేసాడన్నది ఇప్పుడు అప్రస్తుతం. విజయనిర్మల చేతులు వణుకుతున్న తీరు చూస్తే కూతురి మరణం తల్లిని ఎంత కుంగదీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఓ చదువుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోయి, తమకు న్యాయం దక్కాలని పోరాడిన తీరు ఈ సినిమాలో కనిపిస్తుంది. నరేష్ ఏసీపీ పాత్రలో బాగా నటించారు. పోసాని అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కుర్రాళ్లు ముగ్గురూ బాగా నటించారు. సాయికుమార్ భారీ డైలాగ్స్ చెబుతూ కాకుండా సింపుల్ పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.కాసింత ఊరట కలిగించిన విషయం ఏంటంటే మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్. ఆఖరున కనిపించే సుధీర్‌బాబు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు ముప్పలనేని శివ పాత కథనే తీసుకున్నా ఎక్కడా కృష్ణకు భారీ హీరోయిజాన్ని కట్టబెట్టకపోవడం, పాత్రలకు అనుగుణంగా కథను చెప్పాలనుకోవడం బావుంది. కాకపోతే టీవీ సీరియల్ కన్నా ఎక్కువగా సాగదీశారు దర్శకుడు ముప్పలనేని శివ. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరావాలేదు.జిగ్ జాగ్గా చేసిన రమేష్ కొల్లూరి ఎడిటింగ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది.
విశ్లేషణ:
చెప్పుకుంటూ పోవాలేగానీ అడుగడుగునా సినిమాలో లోటుపాట్లు చాల చూడొచ్చు. కథ చాలా పాతది. కాకపోతే పగ అంత తేలిగ్గా పాతబడదనే ఉపశీర్షికతో ముందే ప్రేక్షకుడిని కాస్త జాగృతి పరిచాడు దర్శకుడు. పాటల్లో కమర్షియల్ విలువలు కనిపించవు. సినిమాలో స్పీడ్ స్క్రీన్ ప్లే కనపడదు. ఫస్టాఫ్‌లో కథ ఏంటో తెలిసిపోవడంతో ఆడియెన్ థ్రిల్ ఫీల్ అవరు. ఇండస్ట్రీల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాలు, ఇబ్బందులు పడుతున్న గూడెం వాసులు, వారి కోసం ఎవరో ఒకరు పోరాటం చేయడానికి నడుం బిగించడం, దుండగుల చేతిలో హత్యకు గురవడం, వారి తాలూకు వ్యక్తులు దుష్టులను శిక్షించడం అనేది పాత ఫార్ములా. ఈ పాత చింతకాయ పచ్చడిని శ్రీశ్రీ లో కనీసం కొత్త జాడీలో అయినా పెట్టాల్సింది. మరీ దుమ్ముదూళిపేరుకుపోయిన మరీ పాత జాడీ అనే స్క్రీన్ ప్లేతో నడిపించడం సహనానికి పరీక్షే. కాసింత ఊరట ఏంటంటే మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్. ఆఖరున కనిపించే సుధీర్‌బాబు. అంతకు మించి ఈ సినిమాలో ఊరట కలిగించే అంశాలు ఏమీ లేవు.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5
బ్యానర్ :యస్ .బి .యస్ .ప్రొడక్షన్స్,
నటి నటులు : సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల , సీనియర్ నరేష్,అంగన రాయ్, సాయి కుమార్ ,మురళి శర్మ,యల్.బి . శ్రీ రామ్,పోసాని కృష్ణ మురళి,ప్రిద్వి అతిధి పాత్రలో సుదీర్ బాబు తది తరులు,
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల,
సంగీతం : ఇ.యస్ .మూర్తి,
ఎడిటింగ్ : రమేష్ కొల్లూరి,
నిర్మాతలు : శ్రీ సాయి దీఫ్ చాట్ల, వై.బాలు రెడ్డి,షేక్ సిరాజ్,
కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : ముప్పలనేని శివ,
విడుదల తేది : 03.06.2016