క్రియేటివ్ డైరెక్టర్ గా పేరొందిన కృష్ణ వంశీ సినిమాలలో కనబరిచే వైవిద్యం, దానిని ఆయన తెరకెక్కించే విధానం అందరినీ ఆకట్టుకొంటుంది. ప్రతీ సినిమాపై ఆయన ప్రత్యేక ముద్ర తప్పక ఉంటుంది. అందుకే కృష్ణ వంశీ సినిమాల కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఆయన తీయబోయే తరువాత సినిమా గురించి మీడియాకి కొన్ని ఆసక్తికరమయిన వివరాలు తెలిపారు. ఆ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ బాషలలో నిర్మించబోతున్నట్లు వంశీ తెలిపారు. తరువాత దానిని హిందీలో డబ్ చేసి విడుదల చేస్తామని తెలిపారు.
ఆ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ. 40కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఆ సినిమాకు ‘రుద్రాక్ష’ అనే టైటిల్ పెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా టైటిల్ నిర్ణయించలేదని వంశీ తెలిపారు. ఈ హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలో అనుష్క, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాధారణంగా మంచి కెమెరా వర్క్ కే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే కృష్ణ వంశీ ఈ సినిమాలో 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్ కూడా జోడించబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని వంశీ తెలిపారు.