రంగమార్తాండ తరవాత కృష్ణవంశీ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. ఈసారి ఓ ప్రేమకథని ఎంచుకొన్నారు. ఈ కథలో మpడు జంటలుంటాయి. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కావాలి. అందుకోసం ఆయన అన్వేషణ మొదలెట్టారు. దాదాపుగా కొత్తవాళ్లతోనే ఈ సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. కృష్ణవంశీ ఓ పూర్తి స్థాయి ప్రేమకథని ఎంచుకొని చాలా కాలం అయ్యింది. ఆయన ప్రేమని చూసే కోణం కూడా వేరుగా ఉంటుంది. అదంతా ఈ కథలో మేళవించే అవకాశాలు ఉన్నాయి.
ఈతరం ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తోంది? ప్రేమకు వాళ్లిచ్చే నిర్వచనాలేంటి? అల్ట్రా మోడ్రన్ ప్రేమకథలు ఎలా ఉంటున్నాయి? వీటన్నింటిపైనా కృష్ణవంశీ కాస్త కసరత్తు చేసి ఈ కథ రాసుకొన్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుపుతూనే మరోవైపు, నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు. `చందమామ` తరహాలో స్వచ్ఛమైన వినోదాన్ని, ఈ తరానికి నచ్చేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారని సమాచారం. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.