అన్ని బళ్లెందుకు రా బుజ్జీ.. అసలే పెట్రోల్ రేటు పెరిగిపోయింది..
– అతడులో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ ఇది. భలే పేలిందిలే ఆ సీను.
ఇప్పుడు కృష్ణవంశీ పద్దతి చూసినా సేమ్ టూ సేమ్ ఇలాంటి డైలాగే చెప్పాలనిపిస్తోంది. అసలే పీకల్లోతు ఫ్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ నక్షత్రంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని తహతహలాడుతున్నాడు. చూడ్డానికి ఇదేదో చిన్న సినిమానే అనిపిస్తున్నప్పటికీ భారీ సెటప్ ఉందీ సినిమాలో. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ, ప్రగ్యా జైస్వాల్.. ఇలా పేరున్నోళ్లు, మనకు తెలినోళ్లు, ఇంకా పేర్లు బయటకు రానోళ్లు చాలామందున్నారు. ఓ మినీ మల్టీస్టారర్ రేంజులో ఈ సినిమాని తయారు చేస్తున్నాడు కృష్ణవంశీ. ఆయన గారి టేకింగ్ స్టైల్ మనకు తెలియంది కాదు. స్క్రిప్టు లేకుండా సెట్‌కి వెళ్లడం. అక్కడ కూర్చన్నాక మూడ్‌ని బట్టి సీన్ నటీనటులకు చెప్పి చేయించుకోవడం.. ఇదీ ఆయన పద్దతి. దాంతో ఏ సీన్ ఎప్పుడు తీస్తారో ప్రొడ్యూసర్‌కీ ఆర్టిస్టులకీ ఆఖరికి ఆయనకీ తెలియని పరిస్థితి. దాంతో కృష్ణవంశీ బడ్జెట్లెప్పుడూ కంట్రోల్ తప్పుతూనే ఉంటుంది. నక్షత్రం సినిమాకీ అదే జరుగుతోంది.
ఈ సినిమాకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో రెజీనాపై కృష్ణవంశీ ఓ రొమాంటిక్ పాట షూట్ చేస్తున్నాడని, దాని కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడన్నది ఆ హాట్ న్యూస్ సారాంశం. తన సినిమాల్లో ఒక్కటైనా రొమాంటిక్ పాట తీయడం కృష్ణవంశీకి అలవాటు. అందులో హీరోయిన్ల గ్లామర్‌ని బీభత్సంగా ఆవిష్కరిస్తుంటాడు. సరిగ్గా అలాంటి పాటల కోసమే హీరోయిన్లు కూడా కృష్ణవంశీ సినిమాల్లో నటించాలని తహతహలాడిపోతుంటారు. రెజీనా కూడా అలా అనుకొనే ఈ టీమ్‌లో జాయిన్ అయ్యింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ రెజీనాపై ఓ పాటని ప్లాన్ చేశాడు కృష్ణవంశీ. అందుకోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఈ ఎమౌంట్ పెరిగే ఛాన్సుందని, తగ్గే ప్రసక్తి లేదని తెలుస్తోంది. కేవలం రెజీనాని అందంగా చూపించడానికి కోటి రూపాయలెందుకు?? ఇది వరకు చందమామలో కాజల్‌ని చాలా గ్లామరెస్ గా చూపించాడు కృష్ణవంశీ. దానికి అయిన ఖర్చు వేలల్లో ఉంటుందేమో. అందం అనేది ఖర్చు పెడితే గానీ చూపించలేని వస్తువా?? ఈ విషయం కృష్ణవంశీకి తెలియందేమీ కాదు. పైగా తాను తీస్తోంది స్టార్ సినిమా కాదు. ఎంత ఖర్చు పెట్టినా వర్కవుట్ అయిపోతుందనడానికి. కొత్త వాళ్లతో చేస్తున్న ఓ విధమైన ప్రయోగం ఇది. దానికి తోడు పెద్ద నోట్ల రద్దుతో చిత్రసీమకు దడ పట్టకొంది. సినిమాలవైపు చూసేవాళ్లు తక్కువైపోయారు. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో వీలైతే బడ్జెట్ తగ్గించే మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది. అయినా ఒక్క పాటకు అన్ని డబ్బులెందుకు బుజ్జీ.. అసలే నోట్లు దొరకడం లేదు.