కృష్ణా జలాల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు రాజేస్తోంది. తెలంగాణ సర్కార్.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్‌తో పాటు జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఉద్యమంలో చేసిన వ్యాఖ్యలను చేస్తూ.. ఆంధ్రులనూ కించ పరుస్తున్నరు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆంధ్రులందర్నీ రాక్షసులని తేల్చేసి.. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్‌ను మూర్ఖుడు అన్నట్లుగా మీడియాలో వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం.. ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. మంత్రి అనిల్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి చాలా సాఫ్ట్‌గా మాట్లాడారు. అన్నన్ని మాటలు టీఆర్ఎస్ నేతలు అంటూంటే.. పెద్ద నోరున్న వైసీపీ నేతలుఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నారన్న అనుమానం అందరికీ వస్తోంది.
తెలంగాణ జల రగడపై ఏపీకి ఎందుకు నీళ్లు నములుతోంది..!?
ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదిస్తున్న తెలంగాణ… ఓ వైపు రాజకీయ విమర్శలు చేస్తూనే మరో వైపు ఫిర్యాదులను వేగంగా చేస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు వివరణాత్మక లేఖ పంపింది. అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల.. పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల వీడియోలను పంపింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని.. కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి .. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇచ్చింది.అయినప్పటికీ… కాంట్రాక్టర్ ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఈ క్రమంలో వీడియోలతో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విచారణ జరగపడానికి కృష్ణాబోర్డు కమిటీని కూడా నియమించింది.కానీ ఏపీసర్కార్ అభ్యంతరాలతో ఆగిపోయింది. దీంతో నిజంగానే ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ కడుతోందన్న వాదనకు బలం చేకూరింది.
తెలంగాణకు గట్టిగా ఎందుకు రివర్స్ కౌంటర్ ఇవ్వడం లేదు.?
ఏపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తున్నట్లుగా వాదించడం లేదు. బతిమాలుతున్నట్లుగా ఉంది. తమకు కేటాయించిన నీటినే తీసుకుంటామని.. చెబుతోంది. ఏపీకి తెలుగు గంగ ప్రాజెక్ట్ 29 టీఎంసీలు, ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు, గాలేరు నగరి సుజల స్రవంతి 38 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని తరలించుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ అని చెబుతోంది. దీన్ని మరింతగట్టిగా చెప్పి అనుమతులు తెచ్చుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం.. ఆ పని చేయకుండా… వివాదం అయి… ప్రాజెక్టు ఆగిపోయేలా … వ్యవహరించడంతో సమస్య వస్తోంది. ఇప్పుడా ఆ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ తీరు వల్ల కోర్టు కేసుల్లో.. ట్ర్రైబ్యునల్స్లో ఇరుక్కుపోయే ప్రమాదం కనిపిస్తోంది.
దిగువరాష్ట్ర హక్కులను కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారా..?
ఏపీ దిగువ రాష్ట్రం… దిగువకు వచ్చిన నీరు మాత్రమే వాడుకునే అవకాశం ఉటుంది. అలా తీసుకునే నీరుపై ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించి.. సమస్యల్లేకుండా ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం తేడాగా వ్యవహరించడం వల్ల… తెలంగాణ సర్కార్ కూడా… అదే మాదిరిగా అక్రమ నిర్మాణాలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. గద్వాల , వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద బ్యారేజీ నిర్మించి 70 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోయాలని నిర్ణయించుకుంది. ఇది పూర్తయితే.. ఇక తెలంగాణ నుంచి దిగువకు కృష్ణా జలాలు పారడం.. కష్టమవుతుంది. ప్రగతి భవన్ వేదికగా విందులు చేసుకొని , అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడుతుకున్న ముఖ్యమంత్రులు ఇప్పుడు జలజడగాలు పెట్టుకోవడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. అదే నిజం అయితే.. ఏపీ రైతాంగానికి ముఖ్యంగా రాయలసీమ రైతులకు తీవ్ర ఇబ్బంది కలగడం ఖాయం. ఎందుకంటే జల వివాదాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు.