ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ బీజేపి నేత మరియు నటుడు కృష్ణం రాజు మళ్ళీ చాలా రోజుల తరువాత ఇవ్వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన కూడా మిత్రపక్షమయిన తెదేపాపై, తాము భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై చాలా తీవ్ర విమర్శలు చేసారు.
“కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను వాడుకొంటూ, కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత పదకాలుగా ప్రచారం చేసుకొంటోంది. మళ్ళీ రాష్ట్రాభివుద్ధికి కేంద్రం ఏమీ చేయడం లేదన్నట్లు తెదేపా నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా తెదేపా అడ్డుపడుతోంది. బీజేపీ కార్యకర్తలను వేధిస్తోంది. మా పార్టీ రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి మార్చి 6న రాజమండ్రిలో జరుగబోయే బహిరంగ సభలో మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు. ఆ సభలోనే కేంద్రప్రభుత్వం ఈ 21 నెలల్లో రాష్ట్రానికి ఎన్ని నిధులు అందించిందో, ఏమేమి ప్రాజెక్టులు మంజూరు చేసిందో, ఇంకా మున్ముందు ఏమేమీ చేయబోతోందో ప్రజలకు వివరిస్తాము. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మా పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవిర్భవించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తాము,” అని కృష్ణం రాజు అన్నారు.
ఆయన చేస్తున్న ఆరోపణలలో కేంద్ర పధకాలను, వాటి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను తెదేపా ప్రభుత్వం తన స్వంత ఖాతాలో వేసుకొని వాటిని తమ స్వంతవిగా ప్రచారం చేసుకోవడం కొత్తగా జరుగుతున్నది కాదు. అలాగే దేశంలో అన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంచుమించు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలను మెప్పించి రాజకీయ ప్రయోజనం పొందాలనే చూస్తుంది తప్ప ఆ క్రెడిట్ ని కేంద్రానికి బదిలీ చేయాలనుకోదు. తెదేపా ప్రభుత్వం కూడా అదే చేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో కేంద్ర మంత్రులతో, ప్రధాని నరేంద్ర మోడితో బాగానే ఉంటారు కానీ రాష్ట్ర బీజేపీ నేతలను పట్టించుకోరు. కేంద్ర పధకాలను అమలుచేసేటప్పుడు, రాష్ట్ర వ్యవహారాలలోను వారిని దూరంగా ఉంచుతుంటారు. బహుశః ఆ కారణంగానే వారిలో అసంతృప్తి నెలకొని ఉండవచ్చును. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం అంటే తెదేపా అధికారంపై ఆశలు వదులుకోవడమే. అందుకే రాష్ట్రంలో బీజేపీకి ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతున్నారని భావించవచ్చును. రాష్ట్రంలో బీజేపీ ఏవిధంగా తన రాజకీయ మనుగడ కోసం ఆలోచిస్తోందో, తెదేపా కూడా అదేవిధంగా తన రాజకీయ మనుగడను కాపాడుకోవాలని ఆలోచిస్తోంది. కనుక అందులో అసహజమేమీ లేదు.