రెబల్ స్టార్ కృష్ణం రాజు మంచి భోజన ప్రియులు. తాను తినడమే కాదు, ఇంటికొచ్చినవాళ్లకు రకరకాల వంటకాలతో.. విందు చేస్తారు. మాంసాహారం చేయడంలో, చేయించడంలో కృష్ణంరాజు ఇంట్లోవాళ్లని సెపరేటు హ్యాండు. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుంటే.. ఆ ఇంటి నుంచి క్యారియర్లు.. క్యారియర్లు… వస్తూనే ఉంటాయి. రొయ్యల బిరియానీ, చేపల పులుసు… ఇవన్నీ కృష్ణంరాజు ఇంట్లో మరింత స్పెషల్.
తాజాగా కృష్ణంరాజు పాక శాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని చూపించారు. వంటింట్లో దూరి తన స్వహస్తాలతో చేపల పులుసు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెటింట్లో సందడి చేస్తోంది.
కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రదీమా ఈ వంట వీడదియోని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. `వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్పర్ట్` అని ట్వీట్ చేశారు. ఈ సీజన్లో పుసల చాలా విరివిగా దొరుకుతుంది. గోదారి జిల్లా వాసులకు ఇది చాలా ఇష్టమైన వంటకం. మరి.. కృష్ణంరాజు చేసింది కూడా పులస పులుసే అయ్యింటుంది.