రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. .ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 3.25 గంటలకు ఆయన చనిపోయినట్లుగా ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి.పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు సినీ వారసుడిగా రంగప్రవేశం చేసిన సోదరుడి కుమారుడు ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
దువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. అవే కళ్లు అనే చిత్రంలో విలన్ గా కూడా కృష్ణంరాజు నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
కృష్ణంరాజు తొలుత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు కూడా నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. మార్చి 2009లో బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత మళ్లీ బీజేపీకి వచ్చారు. గవర్నర్ పదవి ఇస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ కోరిక తీరలేదు.