రెబల్ స్టార్ మరియు బిజెపి నేత కృష్ణంరాజు ఇటీవల చిగురించిన బిజెపి జనసేన పొత్తుపై స్పందించారు. ఇది శుభ పరిణామం అంటూ పొత్తు ని ఆహ్వానించారు కృష్ణంరాజు. వివరాల్లోకి వెళితే..
రెబల్ స్టార్ కృష్ణంరాజు వాజ్ పాయ్, అద్వానీ హయాం నుండి బిజెపి లో ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన ఆ సమయంలో బిజెపి నుండి ప్రజారాజ్యంలోకి ఫిరాయించి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరడం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా చిరంజీవిపై విమర్శలు కూడా చేశారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిజెపిలో చేరి ఆ పార్టీ పెద్దలతో సంబంధాలు నెరుపుతున్నారు. ఒకానొక సమయంలో ఆయనకు బిజెపి గవర్నర్ పదవి ఇస్తుందని ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ బీజేపీ మీద గతంలో విమర్శలు చేసిన సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు కూడా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపికి దగ్గరవడం, ఆ పార్టీ పెద్దల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కు పుష్కలంగా ఉండటం, బిజెపి తప్ప మరే ఇతర పార్టీతో ఆంధ్రప్రదేశ్లో తమకు సంబంధం లేదని బీజేపీ పెద్దలు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య ఏర్పడ్డ పొత్తు పై స్పందిస్తూ ఇది శుభ పరిణామమని, ఆంధ్రప్రదేశ్లో బిజెపి విస్తరించడానికి ఈ పరిణామం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఇరు పార్టీల సిద్ధాంతాలను కలుపుకుని పోతూ పవన్ కళ్యాణ్ కూడా మరింతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు సేవ చేసేలా పవన్ కళ్యాణ్ తన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
మొత్తానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు బిజెపి జనసేన పొత్తు ని పూర్తిస్థాయిలో ఆహ్వానించారు.