కృష్ణంరాజు జీవితంలో అన్నీ చూసేశారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, తండ్రిగా, వ్యక్తిగా, భర్తగా అన్ని పాత్రల్నీ సమర్థంగా పోషించారు. అయితే కొన్ని కోరికలు తీరలేదు. భక్తకన్నప్ప సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేద్దామనుకొన్నారు. స్క్రిప్టు కూడా తయారు చేసుకొన్నారు. ఆ సినిమాకి తానే దర్శకత్వం వహించి, నిర్మించాలన్నది ఆశ. కానీ కుదర్లేదు. `ఒక్క అడుగు` పేరుతో ఓ కథ సిద్ధం చేశారు. ఐదుగురు హీరోల మల్టీస్టారర్ ఈ సినిమా. అందులో ప్రభాస్‌కీ ఓ పాత్ర ఉంది. ఇండస్ట్రీలోని చాలా మంది పెద్ద రచయితలు ఈ కథపై కసరత్తు చేశారు. కానీ.. ఇది కూడా పట్టాలెక్కలేదు. గవర్నర్ గా పనిచేయాలని కృష్ణంరాజుకి ఉండేది. ఆమధ్య కృష్ణంరాజుని గవర్నర్ చేస్తారని వార్తలొచ్చాయి. ఓసారైతే.. ఆయన గవర్నర్ అయిపోయారని కూడా అన్నారు. కానీ అది కూడా తీరలేదు. విశాల నేత్రాలు అనే నవలంటే కృష్ణంరాజుకి చాలా ఇష్టం. ఆ నవలని సినిమాగా తీయాలనుకొన్నారు. కానీ అది కూడా కుదర్లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన చాలా ఆశ పడ్డారు. ప్రతీ యేడాది… `ఈ సంవత్సరం ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తా` అంటూనే ఉండేవారు. కానీ.. అది కూడా నెరవేరలేదు.