కృష్ణంరాజు భార్య రాజకీయాల్లోకి వచ్చి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేయాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. కృష్ణంరాజు జయంతి పేరుతో మొగల్తూరులో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను ఆమె చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన చేస్తానని ఆమె చెబుతున్నారు. కృష్ణంరాజు భార్య శ్యమలాదేవి కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యూహంతోనే ఈ సారి జంయతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని బావిస్తున్నారు. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత రెండో జయంతి ఇది. గతం కంటే భిన్నంగా భారీగా చేయాలనుకోవడం వెనుక రాజకీయం ఉందని భావిస్తన్నారు. ఇదే అంశంపై శ్యామలాదేవి కూడా స్బందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తరువాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామల దేవి అన్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం రెబల్ గా మారారు. పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఆయనను ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే కృష్ణంరాజు సతీమణిని సంప్రదించినట్లుగా చెబుతున్నారు.
కృష్ణంరాజు ఇదే నియోజవకర్గం నుంచి 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో రక్షణశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004లో కూడా పోటీ చేశారు గానీ విజయం దక్కలేదు. శ్యామలాదేవి రాజకీయ ఆలోచనలకు కుటుంబం మద్దతు ఉందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.