తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకులు తెలివి మీరిపోయారు. తెలిసిన కథని, అరిగిన కథని, నలిగిన కథని… తిప్పి తిప్పి.. ఇంకోలా చూపించడంలో ప్రావీణ్యం సంపాదించేశారు.
కాకపోతే ఇలాంటి తెలివితేటలు అన్నిసార్లూ వర్కవుట్ అవ్వవు. కొన్నిసార్లు ‘అతి’ తెలివి కూడా బెడసికొడుతూ ఉంటుంది. మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో ఆకట్టుకున్నాడు. అవేం కొత్త కథలు కావు. కానీ తెలివితేటల్ని చూపించాడు. దర్శకుడిగా చిన్న మ్యాజిక్ చేశాడు. దాంతో రొటీన్ కథ హిట్టు సినిమాలా తయారైంది. ఈసారి కూడా… తన తెలివితేటల్ని వాడదామనుకున్నాడు. ఓ పాత పాయింట్ పట్టుకుని దానికి ‘డ్యూయెల్ రోల్’ అనే మెరుగు దిద్ది… వదిలాడు. అదే ‘కృష్ఱార్జున యుద్ధం’.
ఓ హీరో…
సమస్యల్లో హీరోయిన్
ఎలా కాపాడాడు? అనేది – సినిమా పుట్టినప్పటి నుంచీ ఉన్న లైను.
ఇప్పుడు
ఇద్దరు హీరోలు
ఇద్దరు హీరోయిన్లు
వాళ్లని ఎలా కాపాడారు? అనేదే ఈ కృష్ణార్జున యుద్ధం!!
కథ(లు)
కథ నెం 1:
చిత్తూరులో కృష్ణ (నాని) ఊర్లో అమ్మాయిలందరినీ కెలుకుతూ ఉంటాడు. ఎవ్వరూ తనవైపు కన్నెత్తి చూడరు. కొంతమంది ఏకంగా చెప్పులు చూపిస్తుంటారు. అసలు ఈ ఊర్లో మనకు అమ్మాయిలే పడరా.. అని బాధపడుతున్న తరుణంలో హైదరాబాద్ నుంచి రియా( రుక్సార్) దిగుతుంది. తెల్లతోలు అమ్మాయిలంతా మొరటోళ్లనే ఇష్టపడినట్టు కృష్ణ అమాయకత్వానికి, మంచితనానికి, ప్రేమకీ పడిపోతుంది. అది తెలిసిన తాతయ్య (నాగినీడు) రియాకి నాలుగు చివాట్లు పెట్టి – హైదరాబాద్ పంపించేస్తాడు. హైదరాబాద్ వెళ్లిన రియా… అనుకోకుండా మిస్ అవుతుంది.
కథ నెం 2:
యూపర్‌లో అర్జున్ (నాని) ఓ రాక్ స్టార్. కనిపించిన ప్రతీ అమ్మాయినీ లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. చాలా మంది కృష్ణ చూపులకే పడిపోతుంటారు. ఒక్క సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) తప్ప. సుబ్బలక్ష్మి కళ్లలో సూటిగా రెండు నిమిషాలు చూసి.. అదేదో మ్యాజిక్ చేసినట్టు మారిపోతాడు అర్జున్. తన అలవాట్లన్నీ పక్కన పెట్టి సుబ్బలక్ష్మిని నిజాయతీగానే ప్రేమిస్తాడు. కానీ సుబ్బలక్ష్మి మాత్రం అర్జున్‌ని అస్సలు నమ్మదు. అర్జున్ గోల పడలేక చెప్పాపెట్టకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది. అలా హైదరాబాద్ లో అడుగుపెట్టిన సుబ్బలక్ష్మి అనుకోకుండా మిస్ అవుతుంది.
రియాని వెదుక్కుంటూ కృష్ణ… సుబ్బలక్ష్మి కోసం అర్జున్ హైదరాబాద్ వస్తారు. వాళ్లిద్దరూ తాము ప్రేమించిన అమ్మాయిల కోసం ఏం చేశారు? అసలు రియా, సుబ్బలక్ష్మి ఎందుకు తప్పిపోయారు? అనేదే కథ.
విశ్లేషణ
ప్రేమ కోసం, ప్రేయసి కోసం ప్రియుడు ఏం చేశాడన్నది పాత పాయింట్. అయితే ఇక్కడ దానికి డ్యూయల్ రోల్ మిక్స్ చేశాడు దర్శకుడు. నిజానికి డ్యూయెల్ రోల్ డిమాండ్ చేసేంత కథ కాదిది. కేవలం కృష్ణ కథనైనా తీసుకోవొచ్చు. లేదంటే అర్జున్ స్టోరీనైనా చెప్పొచ్చు. రెండింటినీ మిక్స్ చేసి… అక్కడో సీనూ.. ఇక్కడో సీన్ వేసుకుంటూ చెప్పాల్సిన పని లేదు. ‘కృష్ణార్జున యుద్ధం’ అని టైటిల్ ముందు అనుకుని.. కృష్ణ కోసం అర్జునుడిని, అర్జునుడి కోసం కృష్ణని పుట్టించినట్టున్న ‘సినిమా’ అనిపిస్తుంది. చిత్తూరులో కృష్ణ చేసే అల్లరి భలే నచ్చుతుంది. అక్కడి కామెడీ సీన్లన్నీ వర్కవుట్ అయ్యాయి. అమెరికాలో అర్జున్ సీన్ దగ్గరకు వచ్చేసరికి బోర్ కొడుతుంటుంది. తెరపై ఎప్పుడెప్పుడు కృష్ణని చూస్తామా, అనిపిస్తుంటుంది. నాని అంటే వినోదం. అతను పక్కా ఎంటర్టైనర్. ఓ పాత్ర నవ్విస్తుంది కదా, అని రెండో పాత్రని సీరియెస్ మోడ్‌లో చూపిస్తామంటే కుదరదు. దర్శకుడు చేసిన తప్పు అదే. కృష్ణ కథ వేరు, అర్జున్ కథ వేరు. ఈ మిక్సింగ్ సరిగానే కుదిరినా – ఎందుకో కృష్ణ పాత్రని ఓన్ చేసుకున్నట్టుగా అర్జున్ పాత్రని ఎక్కించుకోరు. పైగా నానిని ఓ రాక్ స్టార్‌గా చూపించారు. ఆ పాత్ర, అందులో నాని గెటప్ సూటవ్వలేదనిపిస్తుంటుంది. ఇక్కడ కృష్ణ పాత్రని హిలేరియస్ గా నడిపినట్టే.. యూపర్లోని అర్జున్ పాత్ర నుంచీ అన్ని నవ్వులు రప్పించి ఉంటే.. కథ మరోలా ఉండేది. రాక్ స్టార్ నేపథ్యమే తప్పు అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో క్రైమ్ డ్రామా నడిచింది. కిడ్నాప్ అయిన హీరోయిన్లని కాపాడడమే సెకండాఫ్ లక్ష్యం. ఫస్ట్ షాట్లో హైదరాబాద్‌లో అమ్మాయిల్ని కిడ్నాప్‌లు చేస్తున్న ముఠా ఒకటి ఉందని చూపించేశారు. ఆ షాట్ ఎప్పుడైతే పడిందో… ఇద్దరు హీరోయిన్లూ అందుకు బలవ్వబోతున్నారన్న హింట్ ప్రేక్షకుడికి అందేసింది. దాంతో ఇంట్రవెల్ లో ఏం జరగబోతోందన్న విషయాన్ని ముందే పసిగట్టేసే వెసులుబాటు కల్పించేశాడు దర్శకుడు.
క్రైమ్ కామెడీలు బాగా వర్కవుట్ అవుతున్న రోజులు ఇవి. సెకండాఫ్ మొత్తం దాని చుట్టూ నడిపే అవకాశం ఉంది. కానీ… దాన్ని సరిగా వాడుకోలేదు. సెకండాఫ్ అంతా సీరియెస్ మూడ్‌లోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో కామెడీ చేసిన కృష్ణ కూడా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి రౌద్ర రసం చూపించేస్తుంటాడు. చిత్తూరోడి పాత్రని అలానే కామెడీ టచ్‌తో ఉంచి.. అర్జున్ పాత్రని యాక్షన్ కోసం వాడుకుంటే బాగుండేది. అటు కృష్ణ, ఇటు అర్జున్ ఇద్దరూ సీరియెస్ మూడ్‌లో మారిపోయేసరికి ద్వితీయార్థంలో ఎంటన్టైన్మెంట్కి చోటు లేకపోయింది.
తీసిన పాటలు మిగిలిపోతాయన్న భయం కలిగినప్పుడల్లా కృష్ణ లేదంటే అర్జున్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లడం అక్కడో పాటో, సీనో వేసుకోవడం.. ఇదంతా కథలో టెంపోని పోగొట్టేశాయి. కిడ్నాప్ ముఠాని పట్టుకోవడానికి హీరోలు తమకున్న అపారమైన తెలివితేటల్ని వాడితే బాగుండేది. కనీసం హీరోయిన్లు దొరుకుతారా, లేదా?? అనే ఉత్కంఠత కూడా కలిగించలేకపోయాడు దర్శకుడు. కృష్ణ యాక్షన్ పార్ట్ చూస్తే.. ఇదేదో ప్రభాస్ కోసం రాసుకున్న సీన్లేమో అనిపిస్తుంది. దానికి తగ్గట్టు బాహుబలిలో యుద్ధ సన్నివేశాలకు ఆర్.ఆర్ ఇచ్చినట్టు… నాని ఫైటింగ్ సీన్లకు, స్లో ఎమోషన్ సీన్లకు ఆర్.ఆర్ ఇచ్చేశాడు హిప్ ఆప్ తమిళ. నాని ఇమేజ్ కీ, ఆ యాక్షన్‌కీ, అక్కడున్న రౌడీలకూ, ఆర్.ఆర్కీ అస్సలు పొంతన కుదరదు. క్లైమాక్సంతా పరమ రొటీన్ గా సాగింది.
నటీనటులు
నాని నుంచి ఆశించేది వినోదమే. అది కృష్ణ నూటికి నూరు పాళ్లూ ఇచ్చేశాడు. చిత్తూరు యాసలో నాని చెప్పిన డైలాగులు భలే కుదిరాయి. ఫస్టాఫ్ అంతా తన భుజాలపై వేసుకుని నడిపించేశాడు. కాకపోతే అర్జున్ పాత్ర అంతగా సూటవ్వదు. నాని కాని నానిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీన్లలో నాని.. తన తాహతకు మించిన ప్రదర్శన చేశాడు. ఇవన్నీ చూస్తుంటే `మాస్ హీరో అయిపోవాలని` కంకణం కట్టుకుని చేసిన సినిమాలా అనిపిస్తుంది. అనుపమ, రుక్సార్ ఫర్వాలేదంతే. ఇద్దరికీ సెకండాఫ్‌లో అంత ఛాన్సు లేదు. కృష్ణ బ్యాచ్ బాగానే నవ్వించింది. అర్జున్ దగ్గర మాత్రం ఆ కామెడీ వర్కవుట్ అవ్వలేదు. సంగీతం పేరు చెప్పి… ప్రేక్షకుల్ని హింసించడం తప్ప.
సాంకేతిక వర్గం
పాటలు ఏమాత్రం బాగోలేవు. చిత్తూరు యాసలో పాడిన పాట ఒక్కటీ మాస్ ని మైమరపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చిన ప్రతీ పాటా రాంగ్ టైమింగే. విజువల్‌గా ఈ సినిమా బాగుంది. నిర్మాతల దగ్గర నుంచి ఖర్చు పెట్టించే స్థాయిలో ఏ సన్నివేశమూ లేదు. కాబట్టి బడ్జెట్ పరిధుల్లోనే ఉండి ఉంటుంది. దర్శకుడు రాసుకున్న పాయింట్ చాలా పాతది. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా వైవిధ్యంగా లేదు. కిడ్నాప్‌కి గురైన హీరోయిన్లి కాపాడుకోవడం అనే ఎపిసోడ్లో కాస్త తెలివితేటల్ని, మైండ్ గేమ్‌ని, ఫజిల్లాంటి సన్నివేశాల్ని జోడించాల్సింది. అవేం లేకపోవడంతో పరమ రొటీన్ గా తయారైంది. కామెడీ కోసం రాసుకున్న డైలాగులు, సీన్లు బాగానే పేలాయి. ఆ జోరు సెకండాఫ్ లో లేదు.
తీర్పు
నాని శైలికి, ఇమేజ్‌కీ తగిన కథేం కాదిది. కానీ.. నాని ఎప్పట్లా తానొక్కడే ఈ సినిమాని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇద్దరు నానిలు ఉన్నప్పుడు కచ్చితంగా `డబుల్` వినోదం ఆశిస్తాం. కానీ నాని సోలోగా అందించే వినోదంలో సగం కూడా అందివ్వలేని సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమా గట్టెక్కగలదు, గట్టెక్కుతుంది అనుకుంటే… అది కూడా నాని పుణ్యమే
ఫినిషింగ్ టచ్: డ్యూయెల్ సిమ్.. ఛార్జింగ్ ‘లో..
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5