కృష్ణవంశీ చేస్తున్న సినిమా.. రంగమార్తాండ. మరాఠీలో విమర్శకుల ప్రశంసలు పొందిన… నట సామ్రాట్ కి ఇది రీమేక్. సాధారణంగా కృష్ణవంశీ రీమేకులకు ఇష్టపడడు. కానీ… నట సామ్రాట్ చూసి, ఎమోషనల్ గా ఆ సినిమా ప్రేమలో పడిపోయాడు వంశీ. అందుకే రీమేక్ చేయడానికి భుజాలనెత్తుకున్నాడు. వంశీకి డూ ఆర్ డై సెట్యువేషన్ ఇది. ఇప్పుడు ఓ హిట్టు కొట్టాల్సిందే.
నట సామ్రాట్లో నానా పటేకర్ నటించాడు. నిజంగా తను నట సామ్రాట్టే. ఆ స్థాయి ఉన్న నటుడ్ని రీమేక్ కోసం వెదికి పట్టుకోవడం నిజంగా కష్టమైన పనే. ప్రకాష్ రాజ్ రూపంలో నానాకి ప్రత్యామ్నాయం దొరికింది. అయితే నట సామ్రాట్ లో మరో కీలకమైన పాత్ర ఉంది. నానా పటేకర్ స్నేహితుడిగా విక్రమ్ గోఖలే నటించారు. ఆయన ఓ స్టేజ్ ఆర్టిస్ట్. నట సామ్రాట్లో నానాకి ఎంత పేరొచ్చిందో విక్రమ్కీ అంతే పేరొచ్చింది. ఓ సీన్ లో అయితే నానాని పూర్తిగా డామినేట్ చేసేశాడాయన. అంతటి గొప్ప పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్న వచ్చింది. ఆ స్థానం తెలుగులో బ్రహ్మానందం కి దక్కింది. ఇది నిజంగా రిస్కీ స్టెప్టే. ఎందుకంటే.. ఇది కామెడీ రోల్ కాదు. సీరియస్ ఎమోషనల్ రోల్. ఈ పాత్రకు యాంటీ క్లైమాక్స్ ఇచ్చాడు దర్శకుడు. అలాంటి పాత్రలో బ్రహ్మానందాన్ని ఎంచుకోవడం నిజంగా రిస్కే. దానికి తోడు ఈ సినిమా కోసం బ్రహ్మానందం తొలిసారి గెడ్డం పెంచాడట. ఆ లుక్ లో బ్రహ్మానందం ఎలా ఉంటాడో అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
రంగమార్తాండని తెలుగులో కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడు అనగానే.. ఓ ప్రముఖ సీనియర్ నటుడు వంశీకి ఫోన్ చేసి… ఈ పాత్ర నేను చేస్తా, ఫ్రీగా…. అంటూ ఆఫర్ ఇచ్చాడట. కానీ.. వంశీ మాత్రం.. `ఈ క్యారెక్టర్ లో నేను బ్రహ్మానందంని మాత్రమే చూస్తున్నా… అన్నాడట. అదీ.. ఈ పాత్రపై వంశీ పెంచుకున్న ప్రేమ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పై ఓ కీలకమైన సీన్ ని ఇటీవలే
తెరకెక్కించాడు వంశీ. అది ఈ సినిమాని ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందట. ఆ సీన్ లో బ్రహ్మానందం నటన చూసి, కృష్ణవంశీ భావోద్వేగానికి లోనయ్యాడట. కట్ చెప్పగానే బ్రహ్మానందాన్ని పట్టుకుని ఎమోషన్ అయిపోయాడట. అక్కడ్నుంచి కనిపించిన ప్రతీ ఒక్కరికీ `ఈ సినిమాలో బ్రహ్మానందం ఇరగదీశాడు.. మేమెంత కష్టపడినా క్రెడిట్ మొత్తం ఆయన పట్టుకెళ్లిపోతాడు` అని చెబుతున్నాడట. అదీ ఈ పాత్రపై, బ్రహ్మానందంపై కృష్ణవంశీ పెంచుకున్న ప్రేమ.