ఇప్పుడున్న గ్లామరస్ హీరోయిన్లలో కృతి శెట్టి పేరు ముందు వరుసలోనే ఉంటుంది. ఏ ముహూర్తాన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో గానీ, అన్నీ హిట్లే. సినిమా సినిమాకీ తన క్రేజ్ పెరుగుతూపోతోంది. దానికి తోడు రెమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. కృతి ఎంత అడిగితే, అంత ఇవ్వడానికి నిర్మాతలతు కూడా రెడీ. ఎందుకంటే.. తన డిమాండ్ అలా ఉంది. అయితే.. అన్నీ గ్లామర్ పాత్రలే చేస్తోంది. కానీ.. లోలోపల యాక్షన్, ఫైట్లు ఉండే పాత్ర వస్తే బాగుంటుంది అనుకుంటోందట. ఈ విషయం తనే చెప్పింది.
”ఇప్పటి వరకూ అన్నీ గ్లామర్ పాత్రలే చేశా. నాకు యాక్షన్, ఫైట్లు చేయాలని ఉంది. అయితే అలాంటి కథలేవీ నా దగ్గరకు రాలేదు. చేయడానికి ఇంకా టైమ్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు చేస్తానేమో. అయితే ఈలోగా కొంత అనుభవం సంపాదించుకోవాలి” అంటోంది. ప్రస్తుతం రామ్ తో నటించిన ‘వారియర్’ ప్రమోషన్లతో బిజీగా ఉంది కృతి. ఈ సినిమాలో ఆర్జేగా కనిపిస్తోంది. అందుకోసం కొంత కసరత్తు చేసిందట. ఆర్జీలు, వాళ్లు మాట్లాడే విధానాన్ని దగ్గరుండి పరిశీలించిందట. రామ్ తో నటించడం హ్యాపీగా ఉందని, అయితే… డాన్స్ లో తన స్పీడ్ ని అందుకోవడం చాలా కష్టంగా అనిపించిందని చెబుతోంది. రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో రూపొందిన వారియర్ ఈనెల 14న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.