స్టార్ డమ్ ఒంటరిగా రాదు. వస్తూ వస్తూ పారితోషికాన్ని పెంచుతుంది. ఇమేజ్, క్రేజ్ ఇవన్నీ పెరుగుతాయి. కృతి శెట్టి కి కూడా ఇప్పుడు ఇవన్నీ పరిచయమైపోతున్నాయి. తొలి సినిమాకి కృతి అందుకున్న పారితోషికం కేవలం ఆరు లక్షలు. అది ఇప్పుడు అరవై.. దాటి కోటి చేరింది. ఈమధ్య ఓ బడా నిర్మాత కృతిని కలిసి `సినిమా చేద్దామా` అని అడిగాడట. అందుకు కోటి పారితోషికం డిమాండ్ చేసిందట. అక్కడితో ఆగలేదు. కోరికల చిట్టా చాలానే విప్పిందట. తన ఫుడ్, కాస్ట్యూమ్స్, సిబ్బంది… ఇలా అన్ని విషయాల్లోనూ రూల్స్ అండ్ రెగ్యురేషన్స్ ఏకరువు పెట్టిందట. అవన్నీ విని.. నిర్మాత విస్తుపోయాడని టాక్. `అనుష్క దగ్గర కూడా ఇలాంటి రూల్స్ లేవు` అంటూ.. వెనక్కి వచ్చేశాడట. ఇప్పుడు కృతిని హీరోయిన్గా ఎంచుకోవాలన్న ఆ నిర్మాత.. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తోంది.
స్టార్ డమ్ వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది. డిమాండులు, షరతులు పెరుగుతాయి. చాలామంది నిర్మాతలు `ఇది తప్పదులే` అని లైట్ తీసుకుంటారు. అడిగినవాటికల్లా ఒప్పుకుంటారు. కానీ.. వాటిని భరించడం కష్టమని మెల్లమెల్లగా అనుభవ పూర్వకంగా తేలుతుంది. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్టు.. అదనపు ఖర్చు చాంతాడంత అవుతుంది. అందుకే… సీనియర్ నిర్మాతలు ఈ విషయాల్లో పక్కాగా ఉంటారు.