ఓ హిట్ సినిమా.. అవకాశాల్ని తీసుకొస్తుంది. స్టార్‌ని చేసేస్తుంది.
కానీ ఓ పోస్టర్, ఓ టీజర్, ఓ లుక్.. తో స్టార్స్ అయిపోయేవాళ్లుంటారా? కృతి శెట్టి అలానే స్టార్ అయ్యింది. `ఉప్పెన`కు ముందు కృతి శెట్టి ఎవరో తెలీదు. అయితే… అందులోని స్టిల్స్ ఒకొక్కటిగా బయటకు రావడంతో.. కృతి హవా మొదలైపోయింది. `ఉప్పెన` విడుదల కాకముందే… బిజీ స్టార్ అయిపోయింది. తొలి సినిమా విడుదల కాకముందే.. గంపెడు అవకాశాల్ని చేజిక్కించుకున్న తార గా కృతి కీర్తి సంపాదించింది. ఉప్పెన ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతితో చిట్ చాట్.
* మీ నేపథ్యం ఏమిది?
– మాది బెంగళూరు. కానీ పుట్టి పెరిగింది ముంబైలో. ఇది వరకు కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశాను. అంతకు మించిన అనుభవం ఏం లేదు.
* సినిమాల్లోకి రావాలని ముందు నుంచీ ఉండేదా?
– అలా ఏం అనుకోలేదు. నాకు చదువంటే చాలా ఇష్టం. డాక్టర్ అవ్వాలనుకున్నా. సినిమాలు చూస్తుంటా. కానీ.. నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. మెల్ల మెల్లగా నటనపై ఆసక్తి కలిగింది. `నువ్వు అందంగా ఉంటావు కదా, మోడల్ గా ట్రై చేయొచ్చు` అని స్నేహితులు అంటే.. సరదాగా ట్రై చేశా. `ఉప్పెన` లో నటించే అవకాశం కూడా అనుకోకుండా వచ్చిందే. కథ నచ్చి.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.
* తెలుగు త్వరగానే నేర్చుకున్నట్టున్నారు?
– ఇదంతా దర్శకుడు బుచ్చి గారి చలవే. ఆయనకు తెలుగుపై మంచి పట్టు ఉంది. ఆయన నాతో తెలుగులోనే మాట్లాడేవారు. వైష్ణవ్ తేజ్ తో పాటు… సెట్లో అందరూ తెలుగులోనే మాట్లాడడంతో.. నాకు ఆ సౌండింగ్ నచ్చింది. అలా మెల్లమెల్లగా తెలుగు నేర్చుకున్నా.
* వైష్ణవ్ తేజ్ నటన చూస్తే ఏమనిపించింది?
– తనకీ ఇది తొలి సినిమానే. కానీ ఆ ఫీలింగ్ తనలో కనిపించలేదు. భయం లేకుండా నటించాడు. నాక్కూడా తనలానే.. ఇది వరకు సినిమాలంటే ఇష్టం లేదు. కానీ అనుకోకుండా ఇటువైపు వచ్చాడు. నేనూ అంతే.
* మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– ఇందులో నా పేరు బేబమ్మ. చాలా హైపర్ గా ఉంటుంది. అయితే బయట నేను అలా ఉండను. చాలా కూల్ అండ్ కామ్. నా స్వభావానికి విరుద్ధమైన పాత్ర దొరికింది. ఈ పాత్రని అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది. తొలి రోజు, తొలి షాట్ చాలా టేకులు తీసుకున్నా. కానీ బుచ్చిగారి సపోర్ట్ తో.. మెల్లమెల్లగా పాత్రలో లీనమైపోయా.
* షూటింగ్ సమయంలో మర్చిపోలేని విషయాలేమైనా ఉన్నాయా?
– నాకు ఈ వాతావరణం కొత్త. కాబట్టి.. ప్రతీరోజూ కొత్తగానే ఉండేది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు సెట్‌కి వెళ్తానా అనిపించేది. ఉప్పాడ బీచ్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. అప్పుడు చాలా ఎంజాయ్ చేశా. చెప్పా కదా.. తొలి రోజు షూటింగ్ లో ఎక్కువ టేకులు తీసుకున్నా అని. ఆ తరవాత మెల్లమెల్లగా నాలో నమ్మకం పెరిగింది. ఓ రోజు.. సెట్లో ఓ ఎమోషన్ సీన్ చేస్తుంటే, సెట్లోని ఓ సభ్యుడు ఏడ్చేశాడు. అంతగా సీన్ లో ఇన్వాల్వ్ అయ్యాడన్నమాట. ఆ రోజు.. నాపై నాకు నమ్మకం బాగా పెరిగింది.
* టాలీవుడ్ ఎలా ఉంది?
– చాలా బాగుంది. అమ్మాయిల్ని ఇక్కడ బాగా గౌరవిస్తారు. టాలీవుడ్ గురించి ఇది వరకు పెద్దగా తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. చిరంజీవి సార్ మాత్రం నాకు బాగా తెలుసు. ఆయన గురించి చాలా విన్నా. ఉప్పెన ప్రీ రిలీజ్ కి ఆయన రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం బాగా అనిపించాయి. నా గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.
* విజయ్‌సేతుపతి లాంటి స్టార్ ముందు నటించడానికి భయం వేయలేదా?
– చాలా భయపడ్డా. తొలిసారి ఆయన్ని సెట్లో చూస్తాననగానే కాళ్లు వణికాయి. కానీ విజయ్ సార్.. మాటలు, ఆయన కలిసి మెలిసిపోయిన తీరు చూస్తే.. ఆ భయం పోయింది. నటనకు సంబంధించిన చాలా మెళకువలు నాకు నేర్పించారు.
* తొలి సినిమా విడుదల కాకముందే స్టార్ అయిపోయారు కదా. ఆ ఫీలింగ్ ఎలా వుంది?
– నేను అప్పుడే స్టార్ అయిపోవడం ఏమిటి? అదేం లేదు. ముందు.. `ఉప్పెన` జనాలకు నచ్చాలి. అందులో నా పాత్రని ఇష్టపడాలి. చాలా సినిమాలు చేయాలి. చాలా నేర్చుకోవాలి. ఇప్పుడే కదా.. నా ప్రయాణం మొదలెట్టాను.
* చేస్తున్న సినిమాలేంటి?
– నాని `శ్యాం సింగరాయ్`లో నటిస్తున్నా. సుధీర్ బాబు – ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలు ఇవే. మిగిలినవి చర్చల దశలో ఉన్నాయి. త్వరలో చెబుతా.