`ఆదిపురుష్`…. ప్రభాస్ అభిమానులు కలవరిస్తున్న పేరు. దాదాపు 400 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్రబృందం గర్వంగా చెబుతోంది. అయితే ప్రభాస్‌కి ధీటుగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు ఓంరౌత్ తడబడుతున్నాడేమో అనిపిస్తోంది. ప్రభాస్ కి విలన్ గా సైఫ్ అలీఖాన్ ని ఎంచుకున్నాడు ఓం రౌత్. సైఫ్‌కి సౌత్ లో పెద్ద ఫాలోయింగ్ లేదు. బాలీవుడ్ లోనూ అంతంత మాత్రమే. కాబట్టి.. సైఫ్ ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కథానాయికగా కృతి సనన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సీత పాత్రలో ఆమె ఎంపిక దాదాపుగా ఖాయమైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. ఓం రౌత్ మరో తప్పటడుగు వేశాడనిపిస్తుంది.
ఎందుకంటే.. కృతి సనన్ ఫ్లాప్ హీరోయిన్. తను చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. తెలుగులో కృతిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ.. నార్త్ లో వెలిగిపోతోందా అంటే అదీ లేదు. ఓ పక్క… ప్రభాస్ కోసం బడా హీరోయిన్లు దిగి వస్తున్నారు. రాధే శ్యామ్ లో పూజా హెగ్డే నటిస్తోంది. నాగ అశ్విన్ సినిమా కోసం.. దీపిక పదుకొణెని తీసుకున్నారు. ఇలా.. బాలీవుడ్ లో స్టార్రేంజ్ ఉన్న కథానాయికల్నే తీసుకుంటున్నారంతా. పాన్ ఇండియా స్థాయి సినిమాకి ఇలాంటి ఆకర్షణలు తప్పనిసరి. అభిమానులూ అదే కోరుకుంటారు. అలాంటప్పుడు.. ఫ్లాప్ హీరోయిన్ ని వెదికి పట్టుకోవడం, అందులోనూ `సీత` లాంటి పాత్రకు కావడం.. కాస్త మింగుడు పడని విషయమే. కీర్తి, కైరా అడ్వాణీ లాంటి పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి. కృతిది ఆ రేంజు కూడా కాదాయె. ఇదంతా… హీరోయిన్, ఇతర నటీనటులపై పెట్టే బడ్జెట్ తగ్గించుకొనే ప్రయత్నాలేమో అనిపిస్తోంది. మరి చిత్రబృందం ఏమంటుందో..?