పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోపై తక్షణం వివరణ ఇవ్వలాంటూ.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే.. కొత్త స్కీమ్‌పై ఏపీని వివరణ కోరింది. వెంటనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేయాలని.. రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్‌ను ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203 జీవోపై కేఆర్ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధంగా జీవో ఉందని… 11వ షెడ్యూల్ ప్రకారం గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో.. అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు..ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించరాదని కృష్ణా రివర్ బోర్డు స్పష్టం చేసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయంలో వెనక్కి తగ్గాలనుకోడం లేదు. గోదావరి-కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. పాలమూరు-రంగారెడ్డి, దిండి రిజర్వాయర్, మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాసు ఎత్తిపోతల, కల్వకుర్తి సామర్థ్యం పెంపు, జురాల నుంచి నెట్టెంపాడు సామర్థ్యాన్ని పెంచటం ద్వారా మొత్తం 178 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ లను నిర్మిస్తుందని ఏపీ వాదిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని, అక్రమ నీటి వినియోగాన్ని నిలిపివేయాలని .. చంద్రబాబు హయాంలో ఐదు లేఖలు నదీ యాజమాన్య బోర్డులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసింది. లేఖలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నదీ యాజమాన్య బోర్డులను కోరాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది.
ఓ వైపు… పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేసిన వెంటనే.. కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ స్పందించి.. ఏపీ వివరణ అడగడంతో.. తాము కూడా.. తమ వాదన వినిపిస్తూ.. ఘాటు లేఖ రాయాలని అనుకుంటున్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ విషయంలో.. మాత్రమే కఠినంగా ఉంటున్నారని.. నిబంధనలు అన్ని రాష్ట్రాలకూ ఒకేలా అమలు చేయాలని కోరనున్నారు. అయితే… గత ప్రభుత్వం రాసిన లేఖల విషయంలో ఈ ప్రభుత్వం కాస్త తేడాగా వ్యవహరించింది. కొన్నాళ్ల కిందట.. అన్ని ఫిర్యాదులూ ఉపసంహరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అవే ఫిర్యాదులను.. ఏపీ సర్కార్ హైలెట్ చేసేందుకు సిద్ధమవుతోంది.