కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ఒక్క సారిగా రెండు జట్ల టీమ్ మేనేజ్మెంట్లు ఉలిక్కిపడ్డాయి. వెంటనే మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. బయోబబుల్‌లో ఉన్న కృనాల్‌కు ఎక్కడ కరోనా పాజిటివ్ అంటుకుందో ఎవరికీ అర్థం కాలేదు.
కానీ పాజిటివ్‌గా వచ్చిన పాండ్యాకు ఎలాంటి లక్షణాలు లేవని తెలుస్తోంది. వెంటనే.. మిగతా ఆటగాళ్ల శాంపిల్స్ తీసుకుని ఆర్టీ పీసీఆర్ పరీక్షల శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. వారిలో ఎవరికీ పాజిటివ్ రాకపోతే.. మరో రెండు టీ ట్వంటీలను యధావిధిగా బుధవారం నిర్వహిస్తారు. పొరపాటున మరెవరికైనా పాజిటివ్ అని తేలితే మాత్రం సీరిస్‌ను ఇక్కడితో ఆపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయోబబుల్ లో ఉన్న వారికి పాజిటివ్ రాదని అనుకుంటూ ఉంటారు. ఐపీఎల్లో బయోబబుల్ బ్రీచ్ చేయడంతో కొంత మందికి కరోనా సోకింది. దీంతో టోర్నీనే వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు శ్రీలంకటూర్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కృనాల్ పాండ్యాతో పాటు టీమ్‌లో ఉన్న వారందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లండన్‌లో మరో భారత జట్టతో సూర్యకుమార్ యాదవ్, ఫృధ్వీ షా కలవాల్సి ఉంది. వారు ఇప్పుడు లండన్‌కు బయలుదేరడంపై సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి కరోనా అదే పనిగా.. క్రికెట్‌ను వెంటాడుతోంది.