క్రియేటీవ్ కమర్షియల్ మూవీస్ సంస్థ ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతోంది. గత కొన్నేళ్లుగా సినిమారంగానికి దూరంగా ఉన్న కె.ఎస్ రామారావు కాస్త శక్తిని కూడదీసుకుని సినిమాల్ని నిర్మిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్‌తో ఓసినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే… ఈ ప్రాజెక్టుపై ఆయనకు రాను రాను ఆశక్తి సన్నగిల్లుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈయన సంస్థ నుంచి వచ్చిన `తేజ్` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో రామారావు భారీ నష్టాల్ని చవిచూశారు. ఈ సినిమా పరాజయంతో రామారావు పూర్తిగా అసహనానికీ అసంతృప్తికీ లోనైనట్టు సమాచారం. ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాలపై తప్పకుండా పడుతుంది. `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` సంస్థకు లాభాలేం తీసుకురాలేదు. బొటాబొటీగా గట్టెక్కిందంతే. అంతకు ముందు `దమ్ము` ఎఫెక్ట్ నుంచి ఆయన ఇప్పటి వరకూ బయటపడిందే లేదు. భారీ సినిమాలు పెద్దగా ఆశాజనకంగా లేవని, చిన్న సినిమాల్ని తీస్తూ వస్తున్నారు. అవి కూడా.. ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
విజయ్ దేవరకొండతో ఓసినిమా ఓకే అయ్యింది. విజయ్‌కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి, ఈసినిమాని ముందే అమ్ముకుని సేఫ్ అవ్వొచ్చు. అయితే… ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు కూడ నత్త నడక నడుస్తున్నాయి. విజయ్ దేవరకొండ కాల్షీట్లు ఎప్పుడిస్తాడన్నది ఇంకా తేలలేదు. మరోవైపు క్రాంతిమాధవ్తోనే సినిమా చేయాలా, లేదంటే వేరే దర్శకుడ్ని ఎంచుకోవాలా? అనేదీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎందుకంటే క్రాంతి మాధవ్ నుంచి వచ్చిన ఉంగరాల రాంబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ తన సినిమాపై పడుతుందేమో అని ఆయన భయం. ఇన్ని భయాల మధ్య రామ్‌చరణ్‌తో సినిమా జరిగే పని కాదని, ఆయన ముందే ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. చరణ్ సినిమా చేస్తా.. అని ముందుకొచ్చినా… చరణ్ డేట్లు దొరకడం చాలా కష్టం. ఇప్పటికే రాజమౌళి లైన్లో ఉన్నాడు. ఆ సినిమా 2020లో గానీ పూర్తవ్వదు. అందుకే క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్లో చరణ్ సినిమా అనేది ప్రస్తుతానికి పక్కకు వెళ్లిపోయినట్టే.