కె.ఎస్.రామారావు… నిర్మాతగా దశాబ్దాల అనుభవం ఉంది. ఏకంగా 45 సినిమాలు తీశారాయన. అందులో దాదాపుగా సగం సినిమాలు హిట్లే. చిరంజీవితో ఎక్కువ సినిమాలు తీసి, ఆయన స్టార్ హీరోగా మారడానికి, మెగాస్టార్ అవ్వడానికి ఓ రకంగా పరోక్షంగా కారణమయ్యారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా తీశారు. జులై 6న విడుదల అవుతోంది ఈ చిత్రం. అయితే.. ఈ మెగా ప్రొడ్యూసర్‌కి దర్శకత్వం వహించాలి ఆశ ఉందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ”అప్పట్లో ఓ కథానాయికకు స్టోరీ వినిపించా. చాలా బాగుంది… మా అన్నయ్యని అడిగి చెబుతా. అంది. దాదాపుగా సినిమా పట్టాలెక్కేసే సమయంలో.. ఆ హీరోయిన్ అనుకోని ప్రమాదంలో చనిపోయింది” అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు రామారావు. ఆ హీరోయిన్ సౌందర్య అని టాక్. సౌందర్య ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అన్నయ్యని సంప్రదించేది. హెలీకాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే. లేదంటే… ఆమెతో కె.ఎస్.రామారావు ఓ సినిమా తీయాల్సింది. త్వరలో ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. దానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కూడా. ”చరణ్‌తో సినిమా చేయాలని ఏ నిర్మాత అయినా అనుకుంటాడు. అయితే నా మెగా స్టార్ మాత్రం చిరంజీవి. ఈ ఇద్దరు హీరోలూ ఒకేసారి అవకాశం ఇస్తే.. ముందు నేను చిరంజీవితోనే సినిమా తీస్తా” అంటూ చిరుపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు రామారావు.