నందమూరి హీరో బాలకృష్ణ దగ్గర ఓ విచిత్రమైన అలవాటు ఉంది. ఫామ్ లో ఉన్నప్పుడు ఏ మాత్రం ఫామ్ లేని దర్శకులకు అవకాశం ఇవ్వడం. లెజెండ్, గౌతమి పుత్ర.. సినిమాలతో బాలయ్య రేంజ్ మరింత పెరిగింది. ఈ దశలో స్టార్ దర్శకులు సైతం బాలయ్యతో సినిమా చేయడానికి ముచ్చట పడ్డారు. కానీ వరుస ఫ్లాపులు ఇచ్చిన పూరిని పిలిచి అవకాశం ఇచ్చాడు. పోనీ.. ఆ తరవాతైనా హిట్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడా, అంటే అదీ లేదు. కేఎస్ రవికుమార్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకప్పుడు కె.ఎస్.రవికుమార్ సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడే కావొచ్చు. ఇప్పుడైతే ఫామ్ లో లేడు. పైగా అవుట్ డేటెడ్ కథలతో విసిగిస్తున్నాడు. రజనీకాంత్‌తో చేసిన లింగ ఎంత దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమిళ హీరోలంతా తనతో సినిమా చేయడానికి భయపడుతున్న తరుణంలో ఓ కథ పట్టుకొని టాలీవుడ్ మొత్తం గాలించేశాడు ఈ దర్శకుడు. కానీ ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఈ దశలో బాలయ్య.. ఈ కథకి ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకరకంగా ఇది డేరింగ్ స్టెప్పే. కనీసం పూరితో సినిమా అంటే ఓ కళ ఉంటుంది. తనకి ఫ్లాపులున్నా… సినిమా పరంగా క్రేజ్‌కి ఏ లోటూ ఉండదు. కానీ రవికుమార్ సినిమాకి అదీ ఉండకపోవొచ్చు. కాంబినేషన్ పరంగా.. ఏమాత్రం ఆసక్తి కలిగించని ప్రాజెక్ట్ ఇది. జనాల దృష్టి ఈసినిమాపై మళ్లించాలంటే చాలా కసరత్తే చేయాలి. మంచి టైటిల్, స్టార్ హీరోయిన్, ఇలాంటి అదనపు హంగులతో ఆకట్టుకోవాల్సిందే.