అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించడం, కరోనా సమయంలో విపత్తు నిర్వహణ కంటే రాజకీయ కక్ష సాధింపు పై ప్రభుత్వం దృష్టి పెట్టడం సబబు కాదని విపక్షాలు విమర్శించడం, ఈలోగా కస్టడీలో ఉన్న తనపై పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు కోర్టుకు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం, హైకోర్టు దీనిపై స్పందించడం తెలిసిందే. అయితే పనిగట్టుకొని తమ సామాజిక వర్గం పై జగన్ కక్ష సాధిస్తున్నాడు అంటూ క్షత్రియ సంఘం నేతలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రామరాజు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం క్షత్రియ సామాజిక వర్గం పై కక్ష సాధిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే క్షత్రియులంతా వైఎస్ఆర్సిపి పార్టీ పై తిరగబడతారని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో సైతం సదరు సామాజిక వర్గం జగన్ పాలనలో తమ వర్గం నేతలను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. క్షత్రియ సంఘం అధినేత తో పాటు అదే వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజు కూడా జగన్ క్షత్రియ సామాజిక వర్గం వారిపై కావాలనే దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజు ఉదంతాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. అశోక్ గజపతి రాజు కు సంబంధించిన వ్యవహారాలలో జగన్ జోక్యం చేసుకోవడం, ట్రస్ట్ విషయంలో సామాజిక వర్గ మనోభావాలకు విరుద్ధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
అదేవిధంగా రామలింగరాజు ని అప్పట్లో వైయస్ కుటుంబం బలిపశువును చేసిందంటూ మరి కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో సత్యం రామలింగ రాజు వైయస్సార్ ల మధ్య లావాదేవీలు ఉండేవని, అయితే పరిస్థితి చేజారి పోయాక వైయస్ కుటుంబం సత్యం రామ లింగరాజు ని లొంగి పొమ్మని చెప్పి తాము మాత్రం సేఫ్ అయిపోయారని, రామలింగరాజు ని బలిపశువును చేశారని వారు ఆరోపణ లు చేస్తున్నారు. తండ్రి వైయస్ హయాంలో తమ సామాజిక వర్గానికి ఐకాన్ లాంటి రామలింగరాజు సామ్రాజ్యం కూలిపోతే కొడుకు జగన్ హయాంలో తమ వర్గానికి చెందిన ఎంపీ ని, తన వయసు కు కూడా మర్యాద ఇవ్వకుండా పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే రాజద్రోహం అయితే చంద్రబాబు హయాంలో చంద్రబాబు ని నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ వ్యాఖ్యలు చేసి ఉన్నాడని, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా అనేకసార్లు అనేక రకాల వ్యాఖ్యలు జగన్ చేసి ఉన్నాడని వారు గుర్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ కారణంగా, క్షత్రియ సామాజిక వర్గం లో వైఎస్సార్సీపీపై , జగన్ పై, తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.